ఒకపక్క అంగన్వాడీ కార్యకర్తలు, సహాయకుల సమ్మె కొనసాగుతుండగా ఆశా వర్కర్లు ఆ దిశగా అడుగులు వేయడానికి సిద్ధమవుతున్నారు. విజయవాడలో ఈనెల 21న నిర్వహించే ఆశా వర్కర్ల రాష్ట్ర మహాసభలో సమ్మె నిర్ణయం తీసుకుంటామని ఆశా వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ఇన్‌చార్జి వెంకట సుబ్బయ్య, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎల్.శాంతి వెల్లడించారు. విజయవాడ హనుమాన్‌పేటని దాసరి భవన్‌లో వారు మీడియాతో శనివారం మాట్లాడారు. ఆశా వర్కర్లకు కనీసవేతనం రూ.20 వేలు ఇవ్వాలని, వారిని వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగులుగా గుర్తించాలని, సామాజిక భద్రత, ఉద్యోగ భద్రత కల్పించాలని, వైద్య ఆరోగ్య శాఖలోని ఉద్యోగులకు వర్తించే అన్ని సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ డిమాండ్ల సాధనే లక్ష్యంగా విజయవాడలో రాష్ట్రస్థాయి సదస్సు నిర్వహిస్తున్నామన్నారు. సదస్సు పూర్తయిన తర్వాత సీఐటీయూ ఆధ్వర్యంలో నడిచే సంఘాలతో చర్చించి సమ్మెకు వెళ్తామని ప్రకటించారు. రాష్ట్రంలో మొత్తం 50 వేల మంది ఆశా వర్కర్లు ఉన్నారని చెప్పారు. ప్రభుత్వం నిర్వహించిన జగనన్న సురక్ష కార్యక్రమం విజయవంతం కావడానికి ఆశా వర్కర్లే కారణమని చెప్పారు. ఆశా వర్కర్ల పట్ల ప్రభుత్వం చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు. తక్కువ వేతనాలు ఇచ్చి ప్రభుత్వం తమతో వెట్టిచాకిరి చేయించుకుంటోందని విమర్శించారు.