అధికారం చేజారిపోతుందని అర్థమైన జగన్‌రెడ్డి మోసాలతో గెలవాలనుకుంటున్నారని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ధ్వజమెత్తారు. కుట్రలు, కుయుక్తులు, అరాచకాలు, దౌర్జన్యాలు చేసి, అధికారాన్ని నిలబెట్టుకోవాలనే ఆలోచనలో జగన్‌రెడ్డి ఉన్నారని ఆరోపించారు. టీడీపీపై వ్యతిరేకత వచ్చేలా వీడియోలు చేస్తున్న వైసీపీ కార్యకర్త రామాల మన్విత్ కృష్ణారెడ్డిపై, అతన్ని టీడీపీ నాయకుడిగా చూపుతున్న సజ్జల భార్గవ్‌రెడ్డిపై సోమవారం సీఐడీ ప్రధాన కార్యాలయంలో ఎస్పీ రత్నకు వర్ల రామయ్య ఫిర్యాదు చేశారు. అనంతరం టీడీపీ జాతీయ కార్యాలయంలో మీడియాతో ఆయన మాట్లాడారు. ‘‘చంద్రబాబు అధికారంలోకి రాకుండా ఎన్నో అడ్డదారులు తొక్కుతున్నారు. రాష్ట్రంలో కులాల మధ్య చిచ్చు పెట్టేలా దళితుల్ని తిట్టడం, ఐటీ ఉద్యోగులను నిందించడం చేస్తున్న్డారు. కరుడు కట్టిన వైసీపీ కార్యకర్త రామాల మన్విత్ కృష్ణారెడ్డికి టీడీపీ నాయకుడి వేషం వేయించి, సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారం చేయిస్తున్నారు. తల్లిదండ్రుల పేరు చెప్పుకునే ధైర్యం లేని మన్విత్ కృష్ణారెడ్డి... టీడీపీ నాయకుడినంటూ చంద్రబాబును, టీడీపీని బద్నాం చేయాలని కుట్రలు చేస్తున్నారు. దీనిపై వీడియో క్లిప్పింగులు చూపి, సీఐడీ ఎస్పీకి ఫిర్యాదు చేశా. నిందితులపై ఎస్పీ చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. సీఐడీ చీఫ్ సంజయ్‌కు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా.. టీడీపీపై కుట్రలు చేస్తున్న మన్విత్‌రెడ్డి, సజ్జల భార్గవ్‌రెడ్డిని వెంటనే అరెస్ట్ చేసి, వారి వెనుకున్న జగన్‌రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి పాత్రను వెలుగులోకి తేవాలి. వైసీపీ కుట్రలపై సాక్ష్యాధారాలతో హైకోర్టును ఆశ్రయిస్తాం. వైసీపీ నేతల కుట్రలను ప్రజలు గమనించాలి’’ అని వర్ల కోరారు.