రైతులు తాము పండించిన పంటలకు మద్దతు ధర కంటే రెట్టింపు ఆదాయం సమకూర్చడమే లక్ష్యంగా ఎన్నో సంస్కరణలు, మరెన్నో విప్లవాత్మక మార్పులు రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిందని వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి అన్నారు. గత ప్రభుత్వాలు ఉన్న సంక్షేమ ఫలాలు అందించడమే తప్ప ఇలా వ్యవస్థలో మార్పులు తీసుకొచ్చిన దాఖలాలు లేవన్నారు. విజయవాడలో మంగళవారం జరిగిన ఏపీ గన్వత్ సంకల్ప వర్కుషాపులో ఆయన ముఖ్యఅతిథిగా మాట్లాడుతూ రైతుల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గారు తన పాలనలో అత్యధిక ప్రాధాన్యతనిచ్చారన్నారు. పాదయాత్రలో రైతుల కష్టాలు తెలుసుకున్న ఆయన ప్రతీ విషయంలోనూ వారికి అండగా నిలవాలన్న సంకల్పంతో రైతులకు ఓ వైపు సంక్షేమ ఫలాలు అందిస్తూనే, మరోవైపు వారి అభ్యున్నతి కోసం బలమైన పునాదులు వేసిందన్నారు. గ్రామస్థాయిలో ప్రతీ రైతును చేయిపట్టి నడిపించేందుకు దేశంలో మరెక్కడా లేని విధంగా ఆర్బీకే వ్యవస్థను తీసుకొచ్చిందన్నారు. ఆర్బీకేలకు అనుబంధంగా యంత్ర సేవా కేంద్రాలు, గోదాములతో కూడిన మల్టీ పర్పస్ ఫెసిలిటీ సెంటర్లు ఏర్పాటు చేసిందన్నారు. విత్తు నుంచి విక్రయం వరకు ఆర్బీకేల ద్వారా రైతులకు వెన్నుదన్నుగా నిలుస్తోందన్నారు. ధాన్యంతో సహా ఇతర పంట ఉత్పత్తులను కళ్లాల నుంచే ఆర్బీకేల ద్వారా కొనుగోలు చేస్తూ ప్రతీ రైతుకు మద్దతు ధర దక్కేలా చేస్తోందన్నారు.