సమస్యల పరిష్కారం కోరుతూ అంగన్వాడీలు తలపెట్టిన సమ్మె గురువారానికి 10వ రోజుకు చేరింది. సమ్మెలో భాగంగా ఒంగోలు చర్చి సెంటర్‌లో మానవహారాన్ని ఏర్పాటు చేశారు. ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ అంగన్వాడీలు నినదించారు. జిల్లావ్యాప్తంగా గురువారం కూడా నిరసనలు మిన్నంటాయి. జిల్లాలోని పలుప్రాంతాల్లో అంగన్వాడీలు మానవహారాలు ఏర్పాటు చేసి ప్రభుత్వ మొండివైఖరి వీడాలంటూ డిమాండ్ చేశారు. వెంటనే అంగన్వాడీలతో చర్చలు జరిపి డిమాండ్లను పరిష్కరించాలని కోరారు. ప్రధాన డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరిస్తేనే ఆందోళనను విరమిస్తామని నాయకులు తెల్చిచెప్పారు. వెట్టిచాకిరి చేస్తున్న కార్యకర్తలు, ఆయాలకు వేతనం రూ.26వేలకు పెంచలేమని చెప్పటం ప్రభుత్వం అంగన్వాడీల పట్ల చూపుతున్న చిన్నచూపునకు నిదర్శనమని నాయకులు విమర్శించారు. ఒంగోలులో మానవహారం ఏర్పాటు సందర్భంగా కలెక్టరేట్ ప్రాంతంలో ట్రాఫిక్ స్తంభించిపోయింది. ఈ సందర్భంగా అంగన్వాడీ వర్కర్సు అండ్ హెల్పర్స్ యూనియన్ నాయకులు కెవి.సుబ్బమ్మ, అన్నపూర్ణ మాట్లాడుతూ అంగన్వాడీల సమస్యలను పరిష్కరించకపోతే ప్రభుత్వానికి తమ సత్తా ఎంతో చూపుతామని హెచ్చరించారు. కొత్త ఏడాదిలో ఆందోళనను ఉధృతం చేసి ప్రభుత్వం దిగి వచ్చేదాకా ప్రజాసంఘాలను కలుపుకొని ఉద్యమిస్తామని వారు పేర్కొన్నారు.