తూర్పు గోదావరి జిల్లా, నల్లజర్ల యస్‌ఆర్‌కే కళాశాల వెనుక ఉన్న కాలనీలో గురువారం రాత్రి విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల ఏడిళ్లు దగ్ధం అయ్యాయి. స్థానికుల వివరాల ప్రకారం కాలనీకి చెందిన నక్కా నాగ మంగరాజు ఇంట్లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ అయ్యి మంటలు వ్యాపించడంతో పక్కనే ఉన్న దుర్గారావు, నక్కా పెదమంగరాజు, నక్కా లక్ష్మి, నక్కా చిన్న వెంకన్న, నక్కా శ్రీను, గోవిందు ఇళ్లకు సైతం తాకి పెద్దఎత్తున మంటలు చెలరేగాయి. మంటలో ఇంట్లో ఉన్న గ్యాస్ సిలెండర్లు సైతం పేలిపోయాయి. బీరువాలు, దుస్తులు, వంట సామగ్రి కాలి పూడిదయ్యాయి. సంఘటన విషయం తెలిసి ప్రకాశరావుపాలెంలో ఉన్న ఎమ్మెల్యే తలారి వెంకట్రావు నల్లజర్ల చేరుకుని తన అనుచరులతో సహాయక చర్యలు చేపట్టారు. మూడు అగ్నిమాపక వాహనాలు వచ్చి మంటలను అదుపుచేశాయి. ఎటువంటి ప్రాణనష్టం జరగకపోవడంతో జనం ఊపిరి పీల్చుకున్నారు. ఆస్తినష్టం రూ. 16 లక్షలు ఉంటుందని ప్రాథమికంగా అంచనా వేశారు. ఏడు కుటుంబాల సభ్యు లను యస్‌ఆర్‌కే కళాశాలలో పునరావాసం ఏర్పాటుచేసి వసతులు కల్పించారు. తహశీల్దార్ కిషోర్‌కుమార్, ఎస్‌ఐ నరసింహామూర్తి, కారుమంచి రమేష్, మద్దిపాటి ప్రసాద్ (ఎంపీ), గగ్గర శ్రీను ఆయన వెంట ఉన్నారు. కాగా టీడీపీ నియోజక వర్గ ఇన్‌చార్జి మద్దిపాటి వెంకట్రాజు మాట్లాడుతూ ప్రభుత్వం బాధిత కుటుంబాలకు రూ10.లక్షల చొప్పున నష్ట పరిహారం అందించాలని డిమాండ్ చేశారు.