మార్కాపురం పరిధిలోని పెద్దారవీడు మండలం దేవరాజుగట్టు శ్రీ కాశీనాయన ఆశ్రమం వద్ద జరుగుతున్న ఎడ్ల బలప్రదర్శన పోటీలు రసవత్తరంగా సాగుతున్నాయి. శ్రీ కాశీనాయన ఆశ్రమంలో 28వ ఆరాధన మహోత్సవాల సందర్భంగా సోమవారం తెలుగు రాష్ట్రాల స్థాయి పాల పండ్ల సైజు ఎడ్ల బలప్రదర్శన పోటీలు నిర్వహించారు. ఈ పోటీలను తిలకించేందుకు చుట్టుపక్కల గ్రామాల రైతులు, పశుపోషకలు, అభిమానులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. ఈ పోటీలలో మొత్తం జతల ఎడ్లు పాల్గొన్నాయి. ఈ పోటీల్లో పల్నాడు జిల్లా, తాళ్లూరు మండలం పాకలపాడు గ్రామానికి చెందిన రాయపాటి విశ్వేశ్వరరావు ఎడ్లజత 2,707 అడుగుల దూరం బండ లాగి మొదటి బహుమతి సాధించాయి. రెండబ బహుమతి పల్నాడు జిల్లా శావల్యాపురం మండలం మతకమల్ల గ్రామానికి చెందిన మాండ్రు మల్లయ్య ఎడ్లజత 2600 అడుగుల దూరం లాగి గెలుచుకున్నాయి. మూడో బహుమతి గుంటూరు జిల్లా కాకుమాను మండలం కొండపాటూరు గ్రామానికి చెందిన పోతిన లక్షిత్ చౌదరి ఎడ్లజత గెలుచుకొంది. 2574 అడుగుల దూరం బండలాగాయి. నాలుగో బహుమతి బాపట్ల మండలం మార్టూరుకు చెందిన గౌతుకల్లు వెంకటకృష్ణ ఎడ్ల జత గెలుచుకొంది. 2559 అడుగుల దూరం బండను లాగాయి. ఐదో బహుమతి గుంటూరు జిల్లా ప్రత్తిపాడుకు చెందిన పమిడి అంజయ్య చౌదరి ఎడ్లజత గెలుచుకొంది. 2518 అడుగుల దూరం బండను లాగాయి. విజేతలకు వరసగా, రూ.25,116, రూ.20,116 రూ.15,116, రూ.10,116, రూ.5,116లు అందజేశారు. ముందుగా ఈ పోటీలను మార్కెట్ యార్డు ఛైర్మన్ గొలమారి శ్రీనివాసరెడ్డి, కాశినాయన ఆశ్రమం కమిటీ అధ్యక్షులు గుంటక సుబ్బారెడ్డి, కుందురు బాలిరె డ్డి, నిర్వాహక కమిటీ సభ్యులు పాపిరెడ్డి పాల్గొన్నారు. పోటీలను తిలకించేందుకు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ప్రజలు అధిక సంఖ్యలో హాజరయ్యారు. మంగళవారం సీనియర్ విభాగం నందు బండలాగు పోటీలు నిర్వహించనున్నారు.