అంగన్‌వాడీలకు మరింత చేయూతనివ్వడానికి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని.. వారి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించడానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందని రాష్ట్ర మంత్రుల బృందం తెలిపింది. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని సమ్మెను విరమించుకోవాలని అంగన్‌వాడీ కార్యకర్తలు, సహాయకులకు బుధవారం ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేసింది. అంగన్‌వాడీలు చేస్తున్న సమ్మెతో రాష్ట్రంలో గర్భిణులు, బాలింతలు, పసిపిల్లలు పౌష్టికాహారం అందక ఇబ్బందులు పడుతున్న విషయాన్ని సహృదయంతో అర్థం చేసుకోవాలని కోరింది. గర్భిణులు, బాలింతలు, చిన్నపిల్లల మీద మరింత శ్రద్ధ తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని.. వారి క్షేమం కోసం ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాల్సిన అనివార్య పరిస్థితి తీసుకురావద్దని కోరింది. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అంగన్‌వాడీ కార్యకర్తలు, సహాయకుల ప్రయోజనం కోసం తీసుకున్న వివిధ నిర్ణయాలను పునరుద్ఘాటిస్తూ.. మరిన్ని సానుకూల నిర్ణయాలను తీసుకునేందుకు ప్రభుత్వం సంసిద్ధంగా ఉందని.. అందువల్ల సమ్మెను విరమించాలని కోరింది.