ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జనవరిలో సంక్షేమ పథకాల అమలుకు సిద్ధమయ్యింది. జనవరి నుంచి సామాజిక పింఛన్ కింద రూ.3 వేలు చెల్లించనున్నామని సీఎం జగన్ ప్రకటించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పింఛన్ మొత్తాన్ని రూ.2 వేల నుంచి దశల వారీగా పెంచుకుంటూ వచ్చామన్నారు. వైఎస్‌ఆర్ పింఛన్, ఆసరా, చేయూత పథకాల అమలు, అంబేడ్కర్ విగ్రహం ప్రారంభోత్సవ కార్యక్రమాల నిర్వహణపై జిల్లా కలెక్టర్లతో సీఎం జగన్ తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు.
ఉత్తమ సేవలు అందించిన వాలంటీర్లకు ఫిబ్రవరి 15, 16 తేదీల్లో సేవా మిత్ర, సేవా రత్న, సేవా వజ్ర అవార్డులు అందిస్తామన్నారు. నియోజకవర్గానికి ఐదుగురికి సేవా వజ్ర కింద రూ.30వేలు.. మండలానికి ఐదుగురు, మున్సిపాలిటీలో 10మంది వాలంటీర్లను ఎంపిక చేసి వారికి సేవా రత్న కింద రూ.20వేలు ఇస్తారు. సేవా మిత్ర కింద రూ.10వేలు ఇస్తారు. వాలంటీర్ల హాజరు, పింఛన్ పంపిణీ, ఇతర సర్వేల ఆధారంగా వీరిని ఎంపిక చేస్తారు.
పెన్షన్ కానుక, ఆసరా, చేయూత లబ్ధిదారుల విజయగాథలను వీడియోల రూపంలో పంపాలని, వాటిలో అత్యుత్తమమైన వాటిని ఎంపికచేసి బహుమతులు అందిస్తామని సీఎం ప్రకటించారు. ‘ప్రభుత్వ పథకాలు వారి జీవితాలను ఎలా మార్చాయనేది వీడియోల్లో చూపించాలి అన్నారు. ఉత్తమమైన వాటికి సచివాలయాల స్థాయిలో రూ.10 వేలు, మండల స్థాయిలో రూ.15 వేలు, నియోజకవర్గ స్థాయిలో రూ.20 వేలు, జిల్లా స్థాయిలో రూ.25 వేలు బహుమతిగా ఇస్తామని తెలిపారు.
పింఛన్ల కోసం నెలకు రూ.1,950 కోట్లు ఖర్చు చేస్తున్నామన్నారు సీఎంజగన్. ప్రజాప్రతినిధులందరూ పింఛన్ కానుక కార్యక్రమంలో భాగస్వాములు కావాలన్నారు. పొదుపు సంఘాల మహిళలను ఆర్థికంగా ఆదుకునేలా జనవరి 23 నుంచి 31 వరకు వైఎస్‌ఆర్ ఆసరా కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. చేయూత పథకం కింద ఫిబ్రవరి 5 నుంచి 14 వరకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు చెందిన 26.39 లక్షల మందికి లబ్ధి చేకూరుస్తామన్నారు. జనవరి 19న విజయవాడలో అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తామని.. 19 ఎకరాల్లో 125 అడుగుల విగ్రహాన్ని నిర్మించడానికి రూ.404 కోట్లు ఖర్చు చేశామన్నారు. ప్రతి గ్రామ, వార్డు సచివాలయం నుంచి ఐదుగురిని విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ఆహ్వానించాలి. ప్రతి మండల కేంద్రం నుంచి ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయాలన్నారు.
అర్హత ఉండీ ఎవరైనా, ఎక్కడైనా మిగిలిపోయిన సందర్భాల్లో మళ్లీ రీ వెరిఫికేషన్ చేసి వారికి కూడా పథకాలను వర్తింపచేసే బై యాన్యువల్ (ఏడాదికి రెండు దఫాలు) కార్యక్రమం జనవరి 5వతేదీన జరుగుతుందన్నారుసీఎం. ఆలోపే వెరిఫికేషన్ పూర్తి చేసిన దాదాపు 1.17 లక్షల కొత్త పెన్షన్లు ఒకటో తారీఖు నుంచే ఇస్తారన్నారు. దీంతో 66,34,742మందికి సుమారు రూ.1,968 కోట్లకుపైగా పెన్షన్ల రూపంలో అందుతాయన్నారు. పెంచిన పింఛన్‌తో పాటుగా తన తరపున లేఖను కూడా లబ్ధిదారులకు అందించాలని జగన్ సూచించారు. తన వీడియో సందేశాన్ని కూడా వారికి చేరవేయాలన్నారు. ప్రజాప్రతినిధులు, వలంటీర్లు, గృహ సారథులు, ఉత్సాహవంతులు, వైఎస్సార్ సీపీ మద్దతుదారులు, పార్టీ సానుభూతిపరులు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొనేలా చూడాలని. ఈ కార్యక్రమాన్ని ఒక పండుగ వాతావరణంలో నిర్వహించాలన్నారు.