మోసపూరిత హామీలే పునాదిగా వైసీపీ అధికారంలోకి వచ్చిందని ఎంపీ కింజరాపు రామ్మోహన్‌నాయుడు ఆరోపించారు. సీఎం జగన్ ఒక ఆర్థిక ఉగ్రవాది అని, ప్రజాస్వామ్య విలువలు ఆయనకు పట్టవని విమర్శించారు. దోచుకోవడమే ఎజెండాగా పాలన సాగిస్తూ.. ఇప్పటివరకూ కేవలం 15శాతం హామీలు మాత్రమే అమలు చేశారని తెలిపారు. శుక్రవారం స్థానిక 80 అడుగుల రోడ్డులోని జిల్లా టీడీపీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవితో కలిసి వైసీపీ మోసపూరిత హామీల అమలుపై బుక్‌లెట్‌ను ఎంపీ ఆవిష్కరించారు. అనంతరం విలేకరులతో ఎంపీ రామ్మోహన్‌నాయుడు మాట్లాడారు. ‘2019 ఎన్నికల్లో జగన్ రెడ్డి.. మొత్తం 730 హామీలను ఇచ్చారు. అందులో 109 హామీలను మాత్రమే అమలు చేశారు. ఇంకా ప్రజలను మోసగించేందుకు 99.5శాతం హామీలు అమలు చేశామని అబద్ధాలు ఆడుతున్నారు. దీనిపై పూర్తి ఆధారాలతో బుక్‌లెట్‌ను విడుదల చేస్తున్నాం. పనికిమాలిన విమర్శలు చేస్తే విలువ ఉండదని.. దమ్ముంటే ఈ పుస్తకంపై బహిరంగ చర్చకు రావాల’ని మంత్రి సీదిరి అప్పలరాజు, వైసీపీ నేతలకు ఎంపీ సవాల్ విసిరారు. దీనిపై ఏ వేదికపైనైనా చర్చించేందుకు సిద్ధమని స్పష్టం చేశారు. ‘ఇసుక, మద్యం దోపిడీ, భూ కబ్జాలతోనే వైసీపీ పాలన కొనసాగింది. జాబ్ క్యాలెండర్, మెగా డీఎస్సీ హామీలు అటకెక్కాయి. అంగన్‌వాడీలు, వివిధ శాఖల ఉద్యోగులు హామీలు అమలుచేయాలని న్యాయంగా పోరాడుతుంటే.. వారిని అణగదొక్కాలని చూడడం అన్యాయం. పథకాల పేరిట డబ్బులిచ్చి.. నీరు, పెట్రోల్, విద్యుత్, ఇళ్లు, చివరకు చెత్తపైనా కూడా పన్నులు విధించి దోచుకున్నారు. మోసపూరిత హామీలతో ప్రజలను మభ్యపెట్టే రోజులు పోయాయి. రానున్న ఎన్నికల్లో వైసీపీని సాగనంపడం ఖాయమ’ని ఎంపీ తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు పీఎంజే బాబు, పార్టీ నగర అధ్యక్షుడు మాదారపు వెంకటేష్, రాష్ట్ర రైతు సంఘం ప్రధాన కార్యదర్శి సింతు సుధాకర్, రాష్ట్ర తెలుగు యువత ప్రధాన కార్యదర్శి కొర్ను నాగార్జున ప్రతాప్, రాష్ట్ర ఎస్సీ సెల్ అధ్యక్షుడు ఎస్వీ రమణ మాదిగ, జిల్లా ఉపాధ్యక్షుడు బొనిగి భాస్కరరావు, జిల్లా జంగమ సేవా సంఘం అధ్యక్షుడు విభూది సూరిబాబు, డివిజన్ ఇన్‌చార్జి కవ్వాడి సుశీల పాల్గొన్నారు.