ముందస్తు వ్యవసాయ ప్రణాళికలు లేకుండా ప్రభుత్వాలు వ్యవహరించడం వల్లే రైతాంగం సంక్షోభంలో కూరుకుపోయిందని కౌలు రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.జమలయ్య ధ్వజమెత్తారు. శుక్రవారం పశ్చిమ గోదావరి జిల్లా, ముసునూరు మండలం చెక్కపల్లిలో రాష్ట్ర రైతు సంఘం ఏలూరు జిల్లా ప్రథమ మహాసభ రైతు నాయకులు పి.సోమశేఖర్, గన్ను వెంకటరావు, మడుపల్లి నాగేంద్రరావు అధ్యక్షతన జరిగింది. తొలుత రైతు నాయకుడు కూచిపూడి లక్ష్మీనారాయణ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. సభా ప్రాంగణంలో రైతు సంఘం పతాకాన్ని పీఏసీఎస్ మాజీ డైరెక్టర్ కొమ్మన నాగేశ్వరరావు ఆవిష్కరించారు. అనంతరం జరిగిన సభలో జమలయ్య మాట్లాడు తూ దేశంలో రైతు ఆత్మహత్యల్లో రాష్ట్రం రెండో స్థానంలో ఉందన్నారు. ధాన్యం ధరల విషయంలో స్వామినాథన్ సిఫార్సులను అమలు చేయలేకపోతున్నారని, ఆర్బీకేలు రైస్ మిల్లర్లకు దళారులుగా వ్యవరిస్తున్నాయన్నారు. మోటార్లకు మీటర్లు పెట్టడం ద్వారా రైతును దొంగగా చిత్రీకరించే ప్రయత్నాలు సాగుతు న్నాయన్నారు. రైతాంగం పోరాటానికి సిద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు. సాగునీటి సంఘాల రాష్ట్ర అధ్యక్షులు ఆళ్ళ గోపాలకృష్ణ మాట్లాడుతూ కృష్ణా జలాలు. చింతలపూడి ఎత్తిపోతలను సాధించుకునేందుకు రైతులు పోరాటానికి సిద్ధం కావాలని ఆయన కోరారు. మహాసభలో రైతుల సమస్యలపై నాయకులు తీర్మానాలు చేశారు. సర్పంచ్ టి. రాధిక సత్యనారాయణ, రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేవీవీ ప్రసాద్, సీపీఐ జిల్లా కార్యదర్శి కృష్ణ చైతన్య, ఏఐటీయుసీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ చలసాని వెంకట రామారావు, రాష్ట్ర రైతుసంఘం నాయకులు డేగా ప్రభాకరరావు, జిల్లా కన్వీనర్ రాయంకుల లక్ష్మణరావు, జిల్లా కార్యదర్శి దొంతా కృష్ణ, తుమ్మల లక్ష్మణరావు, బత్తుల వెంకటేశ్వరరావు ప్రజానాట్యమండలి రాష్ట్ర నాయకులు చంద్రనాయక్, అధిక సంఖ్యలో రైతులు పాల్గొన్నారు.