తిరుమలకు రోజురోజుకూ భక్తుల తాకిడి పెరుగుతోంది. దీంతో తిరుమల తిరుపతి దేవస్థానం హుండీకి కాసుల వర్షం కురుస్తోంది. దక్షిణాది రాష్ట్రాల నుంచే కాకుండా దేశం మొత్తం నుంచి భక్తులు విచ్చేసి స్వామి వారిని దర్శించుకుంటున్నారు. ఇక శ్రీవారికి వచ్చే ఆదాయం కూడా భారీగా పెరుగుతోంది. రోజుకు సగటున శ్రీవారి హుండీ ఆదాయం రూ.3 కోట్లు దాటుతోంది. ఈ క్రమంలోనే 2023 ఏడాదిలో తిరుమల వేంకటేశ్వరుడికి వచ్చిన మొత్తం హుండీ ఆదాయం వివరాలను తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు. గడిచిన ఏడాదిలో మొత్తం శ్రీవారి హుండీ ఆదాయం రూ.1398 కోట్లు వచ్చిందని టీటీడీ అధికారులు తెలిపారు.
తిరుమల శ్రీవారికి భారీగా నగదు, ఇతర విలువైన కానుకలను భక్తులు సమర్పిస్తున్నారు. గత ఏడాది కాలం నుంచి స్వామివారి హుండీ ఆదాయం ప్రతీ నెల రూ.100 కోట్లకు పైగానే సమకూరుతూ వస్తోందని టీటీడీ అధికారులు తెలిపారు. ఇక 2023 సంవత్సరంలో శ్రీవారికి హుండీకి ఏకంగా రూ.1398 కోట్ల ఆదాయం సమకూరిందని తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. 2023 ఏడాదిలో ప్రతీ నెలా హుండీ ఆదాయం రూ.100 కోట్ల మార్క్‌ను దాటినట్లు అధికారులు తెలిపారు.
ఈ క్రమంలోనే 2023 జులై నెలలో అత్యధికంగా రూ.129 కోట్ల హుండీ ఆదాయం లభించిందని తాజాగా టీటీడీ పేర్కొంది. ఇక నవంబర్ నెలలో అత్యల్పంగా రూ.108 కోట్లు హుండీ ఆదాయం వచ్చినట్లు తెలిపింది. ఇక డిసెంబర్ నెలలో కూడా హుండీ ఆదాయం రూ.100 కోట్లు దాటినట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు. దీంతో వరుసగా 22 వ నెల కూడా శ్రీవారి హుండీలో రూ.100 కోట్లకు పైగా నగదు వచ్చి చేరినట్లు పేర్కొన్నారు. ఇక 2023 డిసెంబర్ నెలలో శ్రీవారికి హుండీ ద్వారా రూ.116 కోట్ల ఆదాయం వచ్చినట్లు అధికారులు స్పష్టం చేశారు.