ఎస్సై ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ఎత్తు విషయంలో తమకు అన్యాయం జరిగిందని పేర్కొంటూ కొంత మంది ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించారు. గతంలో 2018 నోటిఫికేషన్‌లో ఎత్తు విషయమై అర్హత సాధించామని, కానీ 2023లో అనర్హులుగా ప్రకటించారని ఆరోపించారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం.. ఎత్తు విషయంలో హైకోర్టును తప్పుదోవ పట్టించేలా వ్యవహరించారని గుర్తించింది. దీంతో ఎస్సై అభ్యర్థులకు ఆసక్తికర శిక్ష విధించింది. నెల రోజులపాటు ప్రభుత్వ ఆసుపత్రులలో సేవలు అందించాలని ఆదేశించింది.
అనంతరం సంబంధిత ఆసుపత్రి నుంచి సేవలు చేసినట్టు సర్టిఫికెట్ తీసుకొచ్చి రిజిస్ట్రార్ జ్యుడీషియల్‌కు అందజేయాలని స్పష్టం చేసింది. ఈ వ్యవహారంపై పూర్తి వివరాలతో ఉత్తర్వులు వెలువరిస్తామని న్యాయమూర్తులు జస్టిస్ జి.నరేందర్, జస్టిస్ ఎన్ విజయ్‌తో కూడిన ధర్మాసనం బుధవారం ఈమేరకు తీర్పు చెప్పింది. రాష్ట్రప్రభుత్వం దాఖలు చేసిన అప్పీల్‌ను అనుమతిస్తున్నట్లు తెలిపింది. అయితే, ఎత్తు విషయంలో అనర్హులుగా ప్రకటించాడాన్ని సవాలు చేస్తూ 24 మంది అభ్యర్థులు హైకోర్టులో పిటిషన్ వేశారు. కోర్టు హాలులో ఎత్తు కొలుస్తామని చెప్పినా.. పిటిషనర్లు నిర్థిష్ట ఎత్తు ఉన్నట్టు వైద్యుల నుంచి ధ్రువపత్రాలు తీసుకురావడంపై ధర్మాసనం తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. ముగ్గురు అభ్యర్థులను ఎత్తు కొలవగా వారు అనర్హులని తేలింది. దీంతో కోర్టును తప్పుదోవపట్టించేలా వ్యవహరించారని, శిక్ష విధిస్తామని గతంలో హెచ్చరించింది. దీంతో సామాజిక సేవా శిక్ష విధిస్తున్నట్లు వెల్లడించింది.
గత అక్టోబరులో అభ్యర్థుల పిటిషన్ వేయడంతో విచారణ చేపట్టి నియామక ప్రక్రియను నిలుపుదల చేయాలని స్టే విధించింది. ఎస్‌ఐ నియామక ప్రక్రియలో ఛాతీ, ఎత్తు డిజిటల్ మీటర్ ద్వారా లెక్కించడంతో అనర్హులయ్యామని వారు వాదించారు. డిజిటల్‌గా కాకుండా మాన్యువల్‌గానే ఫిజికల్ పరీక్షలు నిర్వహించేలా పోలీసు నియామక బోర్డును ఆదేశించాలని కోరారు. ఈ పిటిషన్లపై హైకోర్టు సింగిల్ బెంచ్ జడ్జి జస్టిస్ గన్నమనేని రామకృష్ణప్రసాద్ విచారణ జరిపి స్టే విధించారు. దీంతో ప్రభుత్వం, పోలీస్ నియామక మండలి డివిజన్ బెంచ్‌లో సవాల్ చేశాయి. దీనిపై విచారణ చేపట్టిన ధర్మాసనం.. కోర్టు హాలులో నిర్వహించిన ఎత్తు పరీక్ష ఫలితాలు, రిక్రూట్‌మెంట్ బోర్డు అధికారులు గతంలో నిర్వహించిన ఫలితాలతో సరిపోలినట్టు గుర్తించింది. పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డుపై ఆరోపణలు చేసిన పిటిషనర్లపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అభ్యర్థులు ప్రభుత్వ వైద్యుల నుంచి ధ్రువీకరణ పత్రాలు తెచ్చి.. కోర్టు ముందుంచడంపైనా మండిపడింది. ఈ పత్రాల యథార్థతపై దర్యాప్తు చేయాలని గుంటూరు ఐజీ పాలరాజును ఆదేశించింది. ఆ వైద్యులను కూడా విచారించాలని కూడా స్పష్టం చేసింది.