అనంతపురం: రాప్తాడు ఎమ్మెల్యే తోపుదర్తి జయప్రకాష్ రెడ్డి డబ్బు కోసం తనను బెదిరిస్తున్నారని జగనన్న కాలనీ కాంట్రాక్టర్ పోలీసులకు ఫిర్యాదు చేయడం సంచలనమైన సంగతి తెలిసిందే. బెంగాల్‌కు చెందిన సర్వార్ జహాన్ కుడిమి ప్రాంతంలో జగనన్న కాలనీ అభివృద్ధి పనులు చేశారు. డబ్బులు ఇవ్వాలని బెదిరిస్తున్నారని.. పోలీసుల ద్వారా సమస్యలు సృష్టిస్తున్నారని అనంతపురం జిల్లా ఎస్పీకి ఆయన ఫిర్యాదు చేశారు. 9 మంది కూలీలను అనంతపురం రూరల్ పోలీసు స్టేషన్లో నిర్బంధించారని ఆయన ఆరోపించారు. వారిని విడిపించాలని ఆయన ఎస్పీని కోరారు. తమ కూలీలను విడిపించాలని ఆయన బెంగాల్ ఎంపీ ఏహెచ్ ఖాన్ చౌదరి సాయాన్ని కోరారు.
దీంతో స్పందించిన పార్లమెంట్ సభ్యుడు ఏహెచ్ ఖాన్.. అనంతపురం కలెక్టర్, ఎస్పీకి లేఖ రాశారు. తన నియోజవర్గానికి చెందిన 9 మందిని అనంతపురం రూరల్ పోలీసులు నిర్బంధించారని.. వారిని వెంటనే విడుదల చేయాలని ఆయన కోరారు. వారి కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారన్నారు. ఈ 9 మంది మాల్డా జిల్లా కాలియాచక్ ప్రాంతానికి చెందిన వారని.. కొడిమిలోని వైఎస్సార్ జగనన్న కాలనీలో పని చేస్తున్నారని ఆయన తెలిపారు. ఈ లేఖకు స్పందించిన ఎస్పీ.. దర్యాప్తు బాధ్యతను డీఎస్పీకి అప్పగించారు.
ఈ ఆరోపణల పట్ల ఎమ్మెల్యే తోపుదర్తి ప్రకాష్ రెడ్డి స్పందించారు. తనపై టీడీపీ నేతలు కావాలనే తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. కొడిమి జగనన్న కాలనీలో శాన్వి, లోటస్ సంస్థల మధ్య ఒప్పందం జరిగిందని ఎమ్మెల్యే తెలిపారు. శాన్వి సంస్థ నుంచి రూ.55 లక్షలు అడ్వాన్స్ తీసుకున్న లోటస్ సంస్థ ప్రతినిధులు పనులు చేయకుండా వెళ్లిపోయారని ఆయన ఆరోపించారు. శాన్వి సంస్థ ప్రతినిధుల ఫిర్యాదుతో కొంత మందిని బెంగాల్ వెళ్లి అదుపులోకి తీసుకున్నారని ఆయన చెప్పారు.