కరెన్సీ నోటుపై ఉన్న మహాత్మా గాంధీ బొమ్మ స్థానంలో శ్రీరాముడు, అయోధ్య ఆలయం ఉన్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయోధ్య రామమందిర ప్రారంభోత్సవం రోజున ఈ కొత్త నోట్లను జారీ చేస్తారనే ప్రచారం జరుగుతోంది. అయితే ఇదంతా ఉత్తుత్తి ప్రచారమేనని తెలుస్తోంది. ఇప్పటి వరకూ ఈ విషయమై రిజర్వ్ బ్యాంక్ నుంచి ఎలా ప్రకటనా రాలేదు. జనవరి 22న అయోధ్య రామమందిరం ప్రారంభం కానుంది. ప్రాణప్రతిష్ట కార్యక్రమం కోసం చురుగ్గా ఏర్పాట్లు సాగుతున్నాయి. శిల్పి అరుణ్ యోగ్‌రాజ్ చెక్కిన బాల రాముడి శిల్పాన్ని అయోధ్యలో ప్రతిష్టించనున్నారు. ఇప్పటికే ప్రజలంతా రామ నామ స్మరణలో మునిగి తేలుతున్నారు. రామ మందిర ప్రారంభోత్సవంలో.. దేశం మొత్తం ఈ కార్యక్రమంలో పాలు పంచుకోనుంది. ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం కోసం ఇప్పటికే పలువురికి ఆహ్వానాలు అందాయి.
పిల్లలకి వారి హద్దులు గురించి ఇలా చెప్పండి
అయోధ్యలో రామ మందిర ప్రారంభమవుతోన్న వేళ.. సోషల్ మీడియాలో ఓ వార్త కూడా చక్కర్లు కొడుతోంది. కరెన్సీ నోట్లపై జాతిపిత మహత్మా గాంధీ చిత్రం ఉంటుండగా... గాంధీ స్థానంలో శ్రీరాముడి చిత్రంతో కూడిన రూ.500 నోట్ సోషల్ మీడియాలో దర్శనం ఇస్తోంది. ఓవైపు రాముడు, మరోవైపు ఎర్రకోట స్థానంలో అయోధ్య ఆలయ నమూనా, స్వచ్ఛ భారత్ అని గాంధీజీ కళ్ల జోడు ఉండే ప్రదేశంలో రాముడి బాణంతో కూడిన రూ.500 నోటు ఫొటో వైరల్ వాట్సాప్‌లో అవుతోంది. జనవరి 22న ఈ కొత్త నోటును జారీ చేస్తారనే ప్రచారం జరుగుతోంది. అయితే ఇదంతా ఫేక్ ప్రచారం అని తెలుస్తోంది. ఇప్పటి వరకూ కొత్త కరెన్సీ నోటుపై రిజర్వ్ బ్యాంక్ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. 1996లో కరెన్సీ నోట్లపై అశోకుడి స్థూపం స్థానంలో మహాత్మా గాంధీ సిరీస్‌ను ఆర్బీఐ ప్రారంభించింది. అప్పటి నుంచి కరెన్సీ నోట్లపై గాంధీజీ చిత్రమే ఉంటోంది. గాంధీజీ చిత్రం స్థానంలో రవీంద్రనాథ్ ఠాగూర్, అబ్దుల్ కలాం లాంటి ప్రముఖుల ఫొటోలను కరెన్సీ నోట్లపై ముద్రిస్తారని ఏడాదిన్నర క్రితం ప్రచారం జరిగింది. అయితే అలాంటిదేం లేదని రిజర్వ్ బ్యాంక్ వివరణ ఇచ్చింది.
ఇప్పుడు కూడా శ్రీరాముడి ఫొటోతో కరెన్సీ నోటును తీసుకొస్తామని రిజర్వ్ బ్యాంక్ ప్రకటించలేదు. ఆర్బీఐ వెబ్‌సైట్‌లో మహాత్మా గాంధీ కరెన్సీ సిరీస్ ప్రస్తావన మాత్రమే ఉంది. రివర్స్ ఇమేజింగ్ ద్వారా ప్రయత్నించి చూడగా.. ఒరిజినల్ రూ.500 నోటును ఇలా మార్ఫింగ్ చేశారని అర్థమవుతోంది. ఇది కేవలం ఎడిటింగ్ చేసిన ఫొటో మాత్రమేనని దీన్ని బట్టి చెప్పొచ్చు. ఈ ఎడిట్ ఫొటోను వాట్సప్ యూనివర్సిటీ ఫార్వార్డ్ చేస్తోంది. ఫ్యాక్ట్ చెక్ నిర్వహించే ఫ్యాక్ట్ లీ సైతం ఇది డిజిటల్‌గా ఎడిట్ చేసిన నోటు అని తేల్చింది. ఆర్బీఐ నుంచి అధికారిక ప్రకటన వస్తేనే కరెన్సీ నోట్‌పై శ్రీరాముడు, అయోధ్య చిత్రాలున్న వార్తకు విశ్వసనీయత ఉంటుంది. కాబట్టి ఎడిట్ చేసిన ఇలాంటి ఫేక్ ఇమేజ్‌లను ప్రజలు నమ్మకపోవడమే మంచిదని చెప్పొచ్చు.