దళితుల హత్యలు, దళితులపై అత్యాచారాలు, దాడులను కప్పిపుచ్చుకునేం దుకే అంబేడ్కర్ విగ్రహాన్ని సీఎం జగన ఆవిష్కరించారని మాజీ మంత్రి పరిటాల సునీత విమర్శించారు. ఆమె విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ..... వైసీపీ ఐదేళ్ల పాలనలో గతంలో ఎన్నడూ లేనివిధంగా దళితులపై దాడులు, అత్యాచారాలు, హత్యలు జరిగాయని ఆమె ఆరోపించారు. విగ్రహాలు ఏర్పాటు చేయడం కాదని, దళితులకు న్యాయం చేయాలని ఆమె జగనకు సూచించారు. దళితులకు గతంలో ఉన్న పథకాల కంటే ఏం ఎక్కువ ఇచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. నాలుగున్నరేళ్లలో దళితులపై ఆరు వేలకుపైగా దాడులు జరిగాయని, 188 మంది దళితుల్ని హత్య చేసిన రక్తచరిత్ర జగనకు మాత్రమే ఉందని అన్నారు. ‘దళిత జనోద్ధారకుడిలా నా ఎస్సీలు.. నా ఎస్సీలు అని ఊదరగొడతున్నారు. దళితులకు రాజ్యాంగబద్ధంగా అమలు చేయాల్సిన 27 సంక్షేమ పథకాలను రద్దు చేశారు. ఏ ముఖం పెట్టుకుని అంబేడ్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు..?’ అని ఆమె జగనను ప్రశ్నించారు. టీడీపీ హయాంలో నాలుగు లక్షల మంది దళిత సోదరులకు ఉపాధి కల్పించిన ఎస్సీ కార్పొరేషనను నిర్వీర్యం చేసింది వాస్తవం కాదా అని నిలదీశారు. దళిత బిడ్డలు విదేశాల్లో విద్యనభ్యసించేందుకు తీసుకొచ్చిన అంబేడ్కర్ విదేశీ విద్యా పథకాన్ని నాలుగేళ్ల పాటు అటకెక్కించారని, అంబేడ్కర్ పేరును ఆ పథకానికి తొలగించి అవమానించారని అన్నారు. ఎస్సీలకు ఇచ్చే రుణాలపై టీడీపీ ప్రభుత్వం మొదటి ఏడాది నుంచే సబ్సిడీ అమలు చేసిందని, జగనరెడ్డి మొదటి రెండేళ్లు తొలగించి మూడో ఏట నుంచి అమలయ్యేలా మార్చారని విమర్శించారు. వైసీపీ నాయకులే దళితులను చంపారని ఆరోపించారు. కోడికత్తి కేసులో దళిత బిడ్డ శీనుకు బెయిల్ రాకుండా కుట్రలు చేస్తున్నారని విమర్శించారు. బాధితుడిగా ఉన్న జగనరెడ్డి డిక్లరేషన ఇస్తే శీనుకు బెయిల్ వస్తుందని కోర్టు చెప్పినా, నిందితుడి కుటుంబసభ్యులు వేడుకున్నా జగన కనికరించలేదని అన్నారు. అమాయకుడు, పేద దళిత కుటుంబానికి చెందిన శీనును కోడికత్తి డ్రామాకు వాడుకొని వదిలేశారని ఆరోపించారు. దళితుల్ని అడుగడుగునా వేధిస్తూ, హింసిస్తూ నేడు అంబేడ్కర్ విగ్రహాలు పెట్టి దళిత జాతిని మభ్యపెట్టలేరని అన్నారు. దళితులెవరూ జగనను విశ్వసించే పరిస్థితి లేదని అన్నారు. రానున్న ఎన్నికల్లో దళితులు ఓటుతో వైసీపీకి గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు.