నేషనల్ క్రష్ రష్మిక మందన్నా డీప్‌ఫేక్ వీడియోను తయారుచేసిన నిందితుడు గురించి విస్తుపోయే విషయాలను పోలీసులు వెల్లడించారు. నిందితుడ్ని ఢిల్లీ పోలీసులు శనివారం అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అతడ్ని గుంటూరుకు చెందిన ఈమని శ్రీమాన్‌గా తెలిపారు. ప్రస్తుతం యువకుడు చెన్నైలో బీటెక్ చదువుతున్నాడని చెప్పారు. అయితే, రష్మికపై అభిమానంతోనే తాను డీప్ ఫేక్ తయారు చేశానని శ్రీమాన్ చెప్పినట్టు పోలీసులు పేర్కొన్నారు. అంతేకాదు, సోషల్ మీడియాలో రష్మిక ఫాలోవర్స్ పెంచేందుకే ఈ పనిచేసినట్టు విచారణలో తెలిపాడు.
డీప్ ఫేక్ వైరల్ కావడంతో సోషల్ మీడియాలో దానిని డిలీట్ చేశానని శ్రీమాన్ చెప్పాడని పోలీసులు అన్నారు. అంతేకాదు, రష్మిక పేరు మీద సొంతంగా సోషల్ మీడియాని మెయింటెన్ చేస్తున్నాడని వెల్లడించారు. శ్రీమాన్ని అరెస్టు చేసి ఢిల్లీకి తరలించిన పోలీసులు.. అతడు డిలీట్ చేసిన వీడియోలు అన్నింటినీ తిరిగి పొందడానికి ప్రయత్నిస్తున్నట్టు చెప్పారు. బ్రిటీష్-ఇండియన్ సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయోన్సర్ జరా పటేల్.. లిఫ్ట్ ఎక్కుతున్న ఓ వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ వీడియోలో ఆమెకు బదులు రష్మిక ముఖాన్ని డీప్ ఫేక్ చేసి శ్రీమాన్.. సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.
కాగా, రెండు నెలల కిందట రష్మిక డీప్ ఫేక్ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ కావడంతో దేశవ్యాప్తంగా తీవ్ర చర్చ జరిగింది. ఈ వీడియోపై బిగ్ బి అమితాబ్ సహా ప్రముఖులు స్పందించారు. ప్రధాని నరేంద్ర మోదీ సైతం దీనిపై ఆందోళన వ్యక్తం చేశారు. డీప్ ఫేక్ చాలా ప్రమాదకరమని అన్నారు. కృత్రిమ మేధను ఉపయోగించి సృష్టించడం సమస్యాత్మకమని, దీనిపై ప్రజలకు అవగాహన కల్పించాలని మీడియాను కోరారు.