ఆ రోజు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు డ్వాక్రా సంఘాలకు చెందిన రుణాలను ఆసరా పథకం కింద నాలుగు విడతల్లో చెల్లించాం అని, ఇచ్చిన మాటకు కట్టుబడి మహిళలను ఆర్థికంగా భరోసా ఇస్తూనే, వారిని శక్తిమంతులను చేసేందుకు ఇవాళ తమ ప్రభుత్వం కృషి చేస్తోందని రెవెన్యూ శాఖామాత్యులు ధర్మాన ప్రసాదరావు అన్నారు. శ్రీకాకుళం నగర పాలక సంస్థ పరిధిలో ఉన్న అరసవల్లి, శ్రీకాకుళం రూరల్ మండలం, సింగుపురం, గార మండలానికి చెందిన తూలుగులో ఆసరా నాలుగో విడత నిధుల విడుదలకు సంబంధించిన కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మంత్రి ధర్మాన మాట్లాడుతూ.. 2014 ముందు ఎన్నికల ముందు విపక్ష నేత చంద్రబాబు మీకున్న బ్యాంకు బకాయిలు చెల్లిస్తాం అని చెప్పి,మోసం చేశారు. ఆ రోజు చంద్రబాబు ఇచ్చిన మాట తప్పడంతో ఏం చేయాలో తోచక మహిళామణులు బ్యాంకు మెట్లు ఎక్కలేకపోయారు. కానీ 2019 ఎన్నికల ముందు వై.ఎస్.జగన్ చెప్పినట్లుగా మాట ఇచ్చి, నాలుగు విడతల్లో చెల్లిస్తాం అని చెప్పిన మేరకు నిధుల విడుదల చేసి రుణ విముక్తులను చేశారు. ఆనాడు వైఎస్ జగన్ పాదయాత్రలో మహిళా సంఘాలకు ఈ విషయమై స్పష్టం అయిన హామీ ఇచ్చారు. ఆ మాట ప్రకారం నాలుగో విడతగా ఇప్పుడు చెల్లిస్తున్నాం. ఫిబ్రవరి నెలలో వైయస్ఆర్ చేయూత క్రింద 18,750 రూపాయలు మహిళలకు ఇస్తాం. 45 నుంచి60 ఏళ్ల మధ్య వయస్సున్న మహిళలకు ఆర్థిక భరోసా ఈ పథకం ద్వారా కల్పిస్తాం. ఇవాళ మహిళలను ఆర్థికంగా శక్తిమంతులుగా చేసి, వారిలో దైర్యం నింపిన ప్రభుత్వం ఇది. కుటుంబాలు ఈ రోజు సంతోషంగా ఉంటున్నాయి అంటే దానికి కారణం ఈ ప్రభుత్వమే కదా అని అన్నారు.