ప్రత్యేక హోదా సాధన కోసం తెలుగుదేశం, వైసీపీ ఎంపీలంతా కలిసి మూకుమ్మడిగా రాజీనామాలు చేద్దామని జగనన్న గారు గత ఎన్నికల ముందు చెప్పి మరచిపోయారని షర్మిల ఎద్దేవా చేశారు. ఆయన సీఎం అయిన తరువాత ప్రత్యేక హోదా గురించి ఒక్కసారి కూడా నోరు విప్పలేదని విమర్శించారు. ప్రత్యేక హోదా కోసం ఉద్యమం చేయకపోగా కనీసం మాట వరుసకైనా కేంద్రాన్ని నిలదీయలేదన్నారు. ప్రత్యేక హోదా పూర్తిగా మూలకు చేరగా, కనీసం ప్రత్యేక ప్యాకేజీ కూడా సాధించలేదని పరిస్థితికి వచ్చారని ఎద్దేవా చేశారు. పోలవరానికి 90 శాతం నిధులు ఇస్తామన్న కేంద్రం...తన మాట నిలుపుకోలేదన్నారు. రాష్ట్ర విభజన జరిగి పదేళ్లయ్యిందని, చంద్రబాబునాయుడు ఒక రాజధాని అంటే...జగనన్న గారు మూడు రాజధానులన్నారని, తీరా చూస్తే రాష్ట్రానికి ఒక్క రాజధానే లేకుండాపోయిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.