ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జ్ఞానవాపీని హిందువులకు అప్పగించండి.. ముస్లింలకు వీహెచ్‌పీ సూచన

national |  Suryaa Desk  | Published : Sun, Jan 28, 2024, 08:29 PM

వారణాసిలోని జ్ఞానవాపి స్థలంలో దేవాలయం ఆనవాళ్లు ఉన్నాయని ఏఎస్ఐ నివేదిక నిర్ధారించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో విశ్వహిందూ పరిషత్ తెరపైకి కొత్త డిమాండ్ తీసుకొచ్చింది. మసీదును తగిన ప్రదేశానికి మార్చాలని, అధికారికంగా హిందువులను అక్కడ పూజలకు అనుమతించాలని డిమాండ్ చేసింది. ఏఎస్ఐ నివేదిక బయటకు వచ్చిన రెండు రోజుల వీహెచ్‌పీ ఈ ప్రకటన చేయడం గమనార్హం. ‘జ్ఞానవాపీ మసీదును గౌరవప్రదంగా మరొక సరైన ప్రదేశానికి మార్చడానికి, కాశీ విశ్వనాథ అసలు స్థలాన్ని హిందూ సమాజానికి అప్పగించడానికి అంగీకరించాలని మేము ఇంతేజామియా కమిటీని కోరుతున్నాం’ అని VHP అధ్యక్షుడు అలోక్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు.


జ్ఞానవాపి ప్రాంగణాన్ని స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ విషయంలో ఆచితూచి వ్యవహరించాలనే గత వైఖరికి భిన్నంగా వీహెచ్‌పీ ప్రస్తుతం చేసిన ప్రకటన కీలక పరిణామం. మసీదు ప్రాంతంలో దేవాలయం ఉందన్న ఏఎస్ఐ నివేదిక ప్రకారం.. వాజుఖానా వద్ద బయటపడిన శివలింగానికి పూజలు చేయడానికి హిందూ సమాజాన్ని అనుమతించాలన్న తమ డిమాండ్‌ను ప్రార్థనా స్థలాల చట్టం 1991 సమర్థిస్తుందని అలోక్ కుమార్ అన్నారు. వాజుఖానా అని పిలిచే శివలింగ నిర్మాణం మసీదు లక్షణాన్ని కలిగి లేదనడంలో సందేహం లేదని ఆయన అన్నారు. ప్రాంగణంలో బయటపడిన శాసనాలలో జనార్దన, రుద్ర, ఉమేశ్వర వంటి పేర్లను బట్టి ఇది ఆలయమని చెప్పడానికి సాక్ష్యం’ అని కుమార్ చెప్పారు. 1947 ఆగస్టు 15 నాటికి ఆలయాలు, ప్రార్థనా స్థలాలను ఏ స్వరూపంలో ఉన్నాయో అలాగే కొనసాగుతాయని 1991 నాటి చట్టం చెబుతుంది.


‘భారత్‌లోని రెండు ప్రముఖ మతాల మధ్య స్నేహపూర్వక సంబంధాలను ఏర్పరచడానికి ఈ ధర్మబద్ధమైన చర్య ఒక ముఖ్యమైన అడుగు అని వీహెచ్‌పీ విశ్వసిస్తుంది’ అని కుమార్ చెప్పారు. కాశీలోని జ్ఞానవాపి వివాదంపై సర్వే నిర్వహించిన ఏఏస్ఐ నిపుణులు తమ నివేదికను జిల్లా కోర్టు సమర్పించిందని, సేకరించిన ఆధారాలు ఒక అద్భుతమైన ఆలయాన్ని కూల్చివేసి మసీదును నిర్మించినట్లు మళ్లీ నిర్ధారిస్తున్నాయని ఆయన అన్నారు. ‘ఆలయ నిర్మాణంలో ఒక భాగం ముఖ్యంగా పశ్చిమ గోడ హిందూ దేవాలయంలో మిగిలిన భాగం. మసీదు పరిధిని విస్తరించడానికి.. సహన్ నిర్మాణంలో స్తంభాలు, ప్లాస్టర్‌లతో సహా ముందుగా ఉన్న ఆలయంలోని భాగాలను మార్పులతో తిరిగి ఉపయోగించినట్లు నివేదిక రుజువు చేస్తుంది’ అని కుమార్ చెప్పారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com