టీటీడీ పాలకమండలి సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సోమవారం టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో 2024-25 సంవత్సర బడ్జెట్‌కు పాలకమండలి ఆమోదం తెలిపింది. మొత్తం రూ.5141.74 కోట్లతో టీటీడీ వార్షిక బడ్జెట్‌కు ఆమోద ముద్ర పడింది. హిందూ ధార్మిక ప్రచారంలో భాగంగా బంగారు మంగళ సూత్రాలు, లక్ష్మీ కాసులు భక్తులకు విక్రయించాలని టీటీడీ నిర్ణయించింది. టీటీడీ ఉద్యోగుల ఇళ్ల స్థలాల్లో గ్రావెల్ రోడ్డు నిర్మాణానికి ఆమోదం లభించింది.అలాగే లడ్డు ట్రే మోసే కార్మికుల వేతనాలు రూ.15 వేలు అదనంగా పెంచుతూ నిర్ణయం తీసుకుంది. వేద పాఠశాలల్లో 51 మంది సంభావన అధ్యాపకుల వేతనాలు రూ.34 వేల నుంచి రూ.54 వేలకు పెంచాలని నిర్ణయించారు. టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న 60 ఆలయాల్లో పని చేసేందుకు నూతనంగా పోస్టుల మంజూరుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాలని టీటీడీ పాలకమండలి నిర్ణయం తీసుకుంది. 3, 4, 5వ తేదీల్లో ధార్మిక సదస్సును నిర్వహిస్తున్నామని టీటీడీ చైర్మన్ తెలిపారు. 57 మంది మఠ, పీఠాధిపతులు హాజరువుతున్నారన్నారు. వారి సలహాలు, సూచనలను స్వీకరించి అమలు చేస్తామని టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి వెల్లడించారు.