జ్ఞానవాపి మసీదు ప్రాంగణంలో హిందువుల విగ్రహాలకు పూజలు చేసుకోవచ్చని వారణాసి కోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ అలహాబాద్ హైకోర్టుకు వెళ్లిన ముస్లిం పక్షాలకు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. వారణాసి జిల్లా కోర్టు ఉత్తర్వులపై స్టే ఇచ్చేందుకు అలహాబాద్ హైకోర్టు నిరాకరించింది. దీంతో జ్ఞానవాపి మసీదు ప్రాంగణంలోని నేలమాళిగలో యథావిధిగా పూజలు జరగనున్నాయి. అలహాబాద్ హైకోర్టు నిర్ణయంతో పిటిషన్ దాఖలు చేసిన ముస్లిం సంస్థ అంజుమన్ ఇంతేజామియా మసీద్ కమిటీకు షాక్ తగిలినట్లు అయింది.
ఉత్తర్‌ప్రదేశ్‌లోని వారణాసిలో ఉన్న జ్ఞానవాపి మసీదు దక్షిణ సెల్లార్‌లో హిందువుల ప్రార్ధనలకు అనుమతిస్తూ ఇటీవలె వారణాసి కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. ఈ నిర్ణయంపై స్టే ఇచ్చేందుకు ముస్లిం పక్షం అయిన అంజుమన్ ఇంతేజామియా మసీద్ కమిటీ అలహాబాద్ హైకోర్టుకు వెళ్లగా.. శుక్రవారం విచారణ జరిగింది. ఈ క్రమంలోనే స్టే ఇచ్చేందుకు అలహాబాద్ హైకోర్టు అంగీకరించలేదు. కాశీ విశ్వనాథ ఆలయం సమీపంలోని జ్ఞానవాపి మసీదు నేలమాళిగలో హిందూ దేవతలకు పూజలు చేసుకోవడానికి వారణాసి జిల్లా కోర్టు గత బుధవారం అంగీకరించింది.
పూజలు చేసుకోవచ్చని వారణాసి జిల్లా కోర్టు ఉత్తర్వులు ఇచ్చిన కొన్ని గంటల్లోనే అక్కడ హిందూ దేవతలకు పూజలు ప్రారంభం అయ్యాయి. 31 ఏళ్ల తర్వాత ఆ వ్యాస్ కా తెహ్కానాను శుభ్రం చేసి లక్ష్మీ దేవి, వినాయకుడికి అర్చకులు పూజలు చేసి హారతులు ఇచ్చారు. అయితే అక్కడ పూజలు చేసుకునేందుకు హిందువులకు అనుమతి ఇవ్వడాన్ని మసీదు కమిటీ హైకోర్టులో గురువారం సవాల్ చేసింది. జిల్లా కోర్టు తీర్పును అమలు చేయడంలో ఇంత తొందర ఎందుకని ప్రశ్నించింది.
అయితే ముందుగా వారణాసి జిల్లా కోర్టు తీర్పును సవాల్ చేస్తూ ముస్లిం పక్షాలు నేరుగా సుప్రీం కోర్టుకు వెళ్లాయి. అయితే ఆ పిటిషన్‌ను తిరస్కరించిన సుప్రీం కోర్టు.. ముందుగా హైకోర్టును ఆశ్రయించాలని సూచించింది. తాజా పరిణామాల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా వారణాసిలో పటిష్ఠ బందోబస్తును ఏర్పాటు చేశారు. బలగాలను మోహరించి ఫ్లాగ్‌మార్చ్ నిర్వహించారు.