పొత్తులపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. పొత్తుల గురించి బహిరంగంగా ఎవరూ ఎలాంటి వ్యాఖ్యలు చేయవద్దని సూచించారు. ఏపీ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని పొత్తుల దిశగా ముందుకెళ్తున్నామన్న పవన్ కళ్యాణ్.. జనహితం, రాష్ట్ర సమగ్రాభివృద్ధికే జనసేన ప్రథమ ప్రాధాన్యం ఇస్తుందని స్పష్టం చేశారు. పొత్తులపై ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయని.. ఈ దశలో పార్టీ నేతలు తొందరపడి భావోద్వేగంతో ఎలాంటి వ్యాఖ్యలు చేయవద్దని సూచించారు. పార్టీ విధానాలకు భిన్నంగా ఎలాంటి అభిప్రాయాలు ప్రచారం చేయవద్దంటూ శ్రేణులకు సూచించారు. ఇలాంటి ప్రకటనలతో ఏపీ ప్రయోజనాలకు విఘాతం కలుగుతుందని అభిప్రాయపడ్డారు.
మరోవైపు కార్యకర్తలకు ఎవరికైనా సందేహాలు కలిగినా, తమ అభిప్రాయాలను తెలియజేయాలని భావించినా జనసేన పార్టీ రాజకీయ కార్యదర్శి హరిప్రసాద్ దృష్టికి తేవాలని జనసేనాని సూచించారు. తద్వారా మీ ఆలోచనలు, భావోద్వేగాలు పార్టీకి చేరుతాయని వెల్లడించారు. పొత్తులపై పార్టీ విధానాలకు భిన్నంగా ప్రకటనలు చేసే లీడర్ల నుంచి వివరణ తీసుకోవాలంటూ కీలకనేతలకు సూచించారు.అలాగే పొత్తులకు విఘాతం కలిగించాలని ప్రయత్నించేవారిని ప్రజలు గమనిస్తుంటారన్న పవన్ కళ్యాణ్.. ఏపీ ప్రజలు స్థిరత్వాన్ని కోరుకుంటున్నారని అన్నారు. ఈ సమయంలో పార్టీ శ్రేణులంతా అప్రమత్తంగా ఉండడం చాలా అవసరమంటూ పార్టీ కేడర్‌ను అలెర్ట్ చేశారు.
మరోవైపు టీడీపీతో పొత్తు, సీట్ల సర్దుబాటుపై చంద్రబాబుతో ఇప్పటికే పలు దఫాలుగా చంద్రబాబు చర్చలు జరిపారు. ఇటీవల ఒకేరోజు రెండుసార్లు చంద్రబాబుతో చర్చలు జరిపిన పవన్ కళ్యాణ్.. సీట్ల విషయంలో కాస్త పట్టుదలగా ఉన్నట్లు తెలుస్తోంది. టీడీపీ 25 నుంచి 30 సీట్ల వరకూ ప్రతిపాదిస్తుండగా.. పవన్ కళ్యాణ్ మాత్రం ప్రతీ పార్లమెంట్ పరిధిలో ఒక సీటుతో పాటుగా.. ఉభయగోదావరి జిల్లాలలో ఎక్కువ సీట్లు డిమాండ్ చేస్తున్నట్లు తెలిసింది. అలాగే కూటమిలోకి బీజేపీని కూడా తీసుకువచ్చే విషయమై పవన్ కళ్యాణ్ తీవ్రంగా ప్రయత్ని్స్తున్నారు. ఈ విషయమై చంద్రబాబు ఇటీవలే ఢిల్లీ వెళ్లి అమిత్ షాతో భేటీయైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పొత్తులపై పవన్ కళ్యాణ్ క్యాడర్‌ను అలెర్ట్ చేయడం ఆసక్తికరంగా మారింది.