బీజేపీ తన కోర్ మేనిఫేస్టోలో పొందుపరిచిన సంచలన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ వస్తోంది. ఇప్పటికే ఆర్టికల్ 370 రద్దు, అయోధ్యలో రామ మందిర నిర్మాణం, ట్రిపుల్ తలాక్ సహా అనేక నిర్ణయాలను ప్రవేశపెట్టింది. ఈ క్రమంలోనే తాజాగా మరో సంచలన నిర్ణయానికి తెరతీసింది. దేశవ్యాప్తంగా పౌరసత్వ సవరణ చట్టం-సీఏఏను అమలు చేయాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలోనే కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ సీఏఏను 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందే అమలు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు అమిత్ షా తెలిపారు. ఈ పౌరసత్వ సవరణ చట్టాన్ని 2019 లోనే రూపొందించగా.. తీవ్ర నిరసనలు వ్యక్తం కావడంతో అమలుపై కేంద్ర ప్రభుత్వం ఆలస్యం చేస్తోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా అమిత్ షా చేసిన ప్రకటన ప్రాధాన్యం సంతరించుకుంది.
ఢిల్లీలో జరిగిన ఈటీ బిజినెస్ సమ్మిట్‌లో పాల్గొన్న అమిత్ షా.. ఈ ప్రకటన చేశారు. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం గురించి వివరణ ఇచ్చిన ఆయన.. 2019 లో తయారు చేసిన సీఏఏ చట్టాన్ని రాబోయే లోక్‌సభ ఎన్నికల లోపే దేశవ్యాప్తంగా అమలు చేయనున్నట్లు వివరించారు. సీఏఏ గురించి ముస్లింలను తప్పుదోవ పట్టించారని.. వాళ్లను రెచ్చగొట్టేలా చేశారని అమిత్ షా ఆరోపించారు. విదేశాల్లో వేధింపులు తట్టుకోలేక జీవనోపాధి కోసం పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్, బంగ్లాదేశ్ నుంచి భారత్‌కు వలస వచ్చిన వారికి పౌరసత్వాన్ని ఇవ్వనున్నట్లు కేంద్రమంత్రి వెల్లడించారు. ఈ సందర్భంగానే ఎవరి భారతీయ పౌరసత్వాన్ని లాక్కోవడం సీఏఏ ముఖ్య ఉద్దేశం కాదని అమిత్ షా స్పష్టం చేశారు.
ఈ క్రమంలోనే ఉమ్మడి పౌర స్మృతి గురించి కూడా అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. ఉమ్మడి పౌరస్మృతి అమలు కూడా రాజ్యాంగ లక్ష్యమని స్పష్టం చేశారు. దేశ తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ కూడా ఆ ఉమ్మడి పౌర స్మృతి బిల్లు గురించి చర్చించినట్లు గుర్తు చేశారు. కానీ ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి పౌర స్మృతిని విస్మరించిందని విమర్శలు గుప్పించారు. ఉత్తరాఖండ్‌లో యూసీసీ అమలు చేయడం సామాజిక మార్పు అన్నారు. సెక్యులర్ దేశంలో మతపరమైన పౌరస్మృతులు ఉండవని అమిత్ షా తెలిపారు. ఈ సందర్భంగానే కేంద్రంలో ఎన్డీఏ సర్కార్ హ్యాట్రిక్ విజయం సాధిస్తుందని అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి 370 సీట్లు వస్తాయని తేల్చి చెప్పారు. ఇక ఎన్డీఏకు 400 సీట్లు దాటుతాయని పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో ఎన్డీఏ సర్కార్ మూడో సారి ఏర్పడబోతోందని తెలిపారు.