ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇమ్రాన్‌ఖాన్‌‌కు షాక్.. పాక్‌లో సంకీర్ణ ప్రభుత్వం.. నవాజ్ షరీఫ్, భుట్టో పొత్తు

international |  Suryaa Desk  | Published : Sat, Feb 10, 2024, 10:23 PM

ఆర్థిక, రాజకీయ సంక్షోభంతోపాటు ఉగ్రవాద దాడులు, బాంబు పేలుళ్లతో వణికిపోతున్న పాకిస్థాన్‌లో ఎన్నికలు జరిగితే పరిస్థితులు కాస్త కుదుటపడతాయని ఆశించిన ఆ దేశ వాసులకు అలాంటి పరిస్థితి కనిపించడం లేదు. ఎన్నికల వేళ పాకిస్థాన్‌లో హింసాత్మక ఘటనలు చెలరేగగా.. ఆ తర్వాత కూడా అలాంటి సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. మరోవైపు.. పాక్ ప్రజలు స్పష్టమైన తీర్పు ఇవ్వకపోవడంతో అక్కడ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయి. ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో కూటమి ప్రభుత్వం గద్దెనెక్కే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఈ క్రమంలోనే మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్, మాజీ మంత్రి బిలావల్ భుట్టోలకు చెందిన పార్టీలు చేతులు కలిపి ప్రభుత్వాన్ని నెలకొల్పాలని ప్రయత్నాలు చేస్తున్నాయి.


అయితే ఈ ఎన్నికల్లో ఎక్కువ మంది అభ్యర్థులు గెలిచి అతిపెద్ద పార్టీగా అవతరించిన ఇమ్రాన్ ఖాన్ పీటీఐ పార్టీ.. అధికారాన్ని ఏర్పాటు చేసేందుకు కేంద్రం, రాష్ట్రాల్లో ప్రభుత్వ ఏర్పాటుకు మిత్ర పక్షాలతో చర్చలు జరుపుతోంది. అటు.. నవాజ్ షరీఫ్ కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే బిలావల్ భుట్టో నేతృత్వంలోని పీపీపీతో పొత్తు పెట్టుకుని పాక్‌లో ప్రధాని పీఠాన్ని కైవసం చేసుకోవాలని నవాజ్ షరీఫ్ పావులు కదుపుతున్నారు. పాక్‌లో రాజకీయ, ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దేందుకు నవాజ్‌ షరీఫ్‌, బిలావల్ భుట్టో కలిసి పనిచేయాలని అంగీకారానికి వచ్చారు. ఇందులో భాగంగానే ఇరు పక్షాలకు చెందిన నేతలు శుక్రవారం రాత్రి లాహోర్‌లో సమావేశమైనట్లు స్థానిక మీడియా తెలిపింది. ప్రభుత్వ ఏర్పాటుపై చర్చించినట్లు పేర్కొంది.


అయితే ఎన్నికలకు ముందు ఇమ్రాన్‌ఖాన్ నేతృత్వంలోని పాకిస్థాన్ తెహ్రీక్ ఇ ఇన్సాఫ్ పీటీఐ పార్టీ గుర్తును ఎన్నికల సంఘం తొలగించగా.. ఆ పార్టీ అభ్యర్థులు ఇండిపెండెంట్‌గా బరిలోకి దిగారు. ఈ క్రమంలోనే పీటీఐ నేతలు అత్యధిక స్థానాల్లో విజయం సాధించినా మెజారిటీ మార్కును మాత్రం అందుకోలేకపోయారు. 265 స్థానాలు ఉన్న పాక్ జాతీయ అసెంబ్లీలో అధికారాన్ని దక్కించుకోవాలంటే మెజారిటీ మార్కు 133 స్థానాలు కావాలి. కానీ పీటీఐ పార్టీ 100 స్థానాల్లో విజయం సాధించి అతిపెద్ద పార్టీగా అవతరించింది. కానీ ప్రభుత్వా్న్ని మాత్రం ఏర్పాటు చేసే అంత బలం రాలేదు. ఈ క్రమంలోనే ఇమ్రాన్ ఖాన్‌కు వ్యతిరేకంగా ఇతర పార్టీలు ఏకం అవుతున్నాయి.


అయితే పాకిస్థాన్‌లో గురువారం ఎన్నికలు జరగ్గా.. అదే రోజు రాత్రి నుంచి కౌంటింగ్ ప్రారంభమైంది. 2 రోజులగా ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతున్నప్పటికీ.. ఇంకా పూర్తిగా ఫలితాలు వెలువడలేదు. దీంతో ఈ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియపై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇమ్రాన్‌ఖాన్ పార్టీ నేతలు 100 స్థానాల్లో గెలుపొందగా.. నవాజ్ షరీఫ్ నేతృత్వంలోని పాకిస్థాన్ నేషనల్ లీగ్-నవాజ్ పార్టీ 71 స్థానాలు, బిలావల్ భుట్టో నేతృత్వంలోని పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ-పీపీపీ మరో 53 స్థానాలు సాధించింది. ఇతర పార్టీలు 27 స్థానాలు గెలుచుకోగా.. మరో 15 సీట్లలో ఫలితాలు వెల్లడి కావాల్సి ఉంది. ఇక ఫలితాలు ఆలస్యం కావడంతో తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com