ఏపీ కాంగ్రెస్ పార్టీ ఫుల్ జోష్‌లో కనిపిస్తోంది. మొన్నటి వరకూ పోటీచేసేందుకు అభ్యర్థులు ముందుకు రాని పరిస్థితి. కానీ ఇప్పుడు.. హస్తం పార్టీ తరుఫున పోటీచేసేందుకు నేతలు ఆసక్తి కనబరుస్తున్నారు. వివిధ నియోజకవర్గాల నుంచి కాంగ్రెస్ పార్టీ తరుఫున పోటీ చేస్తామంటూ ముందుకు వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏపీపీసీసీ కీలక నిర్ణయం తీసుకుంది. కాంగ్రెస్ తరుఫున పోటీ చేసేందుకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకునేందుకు శనివారం ( ఫిబ్రవరి10) ఆఖరితేదీ. అయితే ఆశావహుల సంఖ్య ఎక్కువగా ఉండటంతో దరఖాస్తు గడువును మరో 20 రోజులు పొడిగిస్తూ ఏపీ కాంగ్రెస్ నిర్ణయం తీసుకుంది. ఫిబ్రవరి 29 వరకూ అప్లై చేసుకునేందుకు ఆశావహులకు అవకాశం కల్పించింది.
ఏపీ వ్యాప్తంగా ఉన్న 175 అసెంబ్లీ, 25 లోక్‌సభ స్థానాల పరిధిలో పోటీచేసేందుకు ఆసక్తి ఉన్న నేతల నుంచి కాంగ్రెస్ పార్టీ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. అయితే శనివారం నాటికి అసెంబ్లీకి 810, ఎంపీ స్థానాలకు 110 దరఖాస్తులు వచ్చినట్లు పీసీసీ వర్గాలు వెల్లడించాయి. దరఖాస్తు చేసుకునేందుకు పార్టీలో చాలామంది నేతలు ఆసక్తి కనబరుస్తున్నారు. దీంతో దరఖాస్తు గడువును ఫిబ్రవరి నెలాఖరు వరకూ పొడిగిస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది.
కాంగ్రెస్‌లో ఈ జోష్‌కు కారణమేంటీ?
2014లో రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో కాంగ్రెస్ పార్టీ అడ్రస్ గల్లంతైంది. ఆ పార్టీ తరుఫున పోటీ చేసేందుకు అభ్యర్థులు ముందుకు రాని పరిస్థితి. ఒకవేళ వచ్చినా హస్తం గుర్తుపై పోటీ చేసిన వారికి నోటా కంటే తక్కువ ఓట్లు వచ్చి, డిపాజిట్లు గల్లంతయ్యేవి. ఈ నేపథ్యంలో ఏపీలో హస్తం గుర్తు గతం వదిలిన జ్ఞాపకమేనని విశ్లేషకులు భావించారు. కానీ అనూహ్యంగా ఏపీలో కాంగ్రెస్ పార్టీ లైమ్ లైట్‌లోకి వచ్చింది. దీనికి వైఎస్ షర్మిల అధ్యక్షురాలిగా నియమితులు కావటం ఒక కారణం. ఏపీసీసీ అధ్యక్షురాలిగా నియమితులైన దగ్గర నుంచి ఏపీలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసే పనిలో పడ్డారు షర్మిల. పాత లీడర్లను కలుపుకోవటం సహా ఇతర పార్టీలో అసంతృప్త నేతల మీద కూడా దృష్టి సారించి ముందుకెళ్తున్నారు.
షర్మిల రాక మాత్రమే కారణం కాదా.. అదీ ఓ రీజనా?
కాంగ్రెస్ పార్టీ తరుఫున ప్రస్తుతం ఒక్కో స్థానానికి ఐదు నుంచి ఎనిమిది మంది నేతలు పోటీపడుతున్నారు. విజయావకాశాల సంగతి పక్కనబెడితే అభ్యర్థులే దొరకరని అనుకున్న పార్టీకి ఇప్పటికే వేయి వరకూ దరఖాస్తులు వచ్చి చేరాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. దీనికి మరో కారణం ఇతర పార్టీల్లోని అసంతృప్త నేతలే. మరోవైపు 2019 ఎన్నికల్లో గ్రాండ్ విక్టరీ కొట్టిన వైఎస్ జగన్.. 2024 ఎన్నికల్లో వైనాట్ 175 అనే నినాదంతో ముందుకెళ్తున్నారు. అందుకు అనుగుణంగా పార్టీ అభ్యర్థులను ఎంపిక చేస్తూ ఇంఛార్జులుగా నియమిస్తున్నారు. ఈ క్రమంలోనే కొంతమంది సిట్టింగ్ ఎమ్మెల్యేలను పక్కనబెడుతున్నారు. ఇలాంటి నేతలకు కాంగ్రెస్ పార్టీ ఒక ఆప్షన్‌గా మారింది. దీర్ఘకాలంగా టీడీపీతో విభేదిస్తూ వచ్చిన నేతలు.. వైసీపీలో టికెట్ రాకపోతే టీడీపీలో చేరేందుకు అవకాశం ఉండదు. పోనీ జనసేన, బీజేపీలోకి వెళ్దామన్నా.. కూటమి తరుఫున సీటు వస్తుందో రాదో అనే డౌటనుమానాలు. ఈ పరిస్థితుల్లో వారందరికీ కాంగ్రెస్ పార్టీ ఒక మంచి అవకాశంగా కనిపిస్తోంది.
దరఖాస్తు పొడిగింపునకు అదే కారణమా?
మరోవైపు కాంగ్రెస్ పార్టీ దరఖాస్తుల గడువు పొడిగింపు వెనుక మరో కారణం కూడా ఉన్నట్లు తెలుస్తోంది. వైసీపీ నియోజకవర్గాల వారీగా ఇంఛార్జులను నియమిస్తోంది కానీ.. టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల నుంచి ఇంకా అభ్యర్థుల ప్రకటన జరగడం లేదు. ఈ పార్టీలు కూడా తమ తరుఫున అభ్యర్థులను ప్రకటిస్తే.. కూటమిలో టికెట్లు దొరకని కీలక నేతలు తమపార్టీలోకి వచ్చే అవకాశం ఉందని హస్తం పార్టీ నేతలు భావిస్తున్నారు. అందుకే దరఖాస్తు గడువును మరో 20 రోజులు పొడిగించినట్లు తెలుస్తోంది.