తమ స్వప్రయోజనాల కోసం ఓ పార్టీ గుర్తుపై గెలిచి ఇంకో పార్టీలోకి ఫిరాయించే గోడమీద పిల్లలకు చెంపపెట్టులాంటి తీర్పు ఇచ్చింది కేరళ హైకోర్టు. ఒక రాజకీయ పార్టీ లేదా కూటమి తరఫున ప్రజలచే ఎన్నికైన ప్రతినిధి ఆ పార్టీ లేదా కూటమికి విరుద్ధంగా తన వైఖరిని మార్చుకోలేరని ఉద్ఘాటించింది. ఒకవేళ, అలా మార్చుకోవాలంటే మళ్లీ ప్రజల్లోకి వెళ్లి వారి తీర్పు కోరాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ప్రజా ప్రతినిధి ప్రజల గొంతుకలా ఉండాలని, ఓటర్ల అభీష్టానికి విరుద్దంగా తన ఇష్టమొచ్చినట్టు మారడం కుదరదని వ్యాఖ్యానించింది. ఈ మేరకు ఇడుక్కి జిల్లాలోని అదిమలి గ్రామ పంచాయతీ సభ్యుడు ఫిరాయింపులకు సంబంధించిన పిటిషన్‌ను కొట్టివేస్తూ ఫిబ్రవరి 5న జస్టిస్ పీవీ కున్హికృష్ణన్ ఉత్తర్వులు జారీ చేశారు.
ప్రజలు ఎన్నుకున్న ప్రతినిధి ఒకవేళ ఫిరాయించాలంటే కుదరదని ఉద్ఘాటించారు. ‘ఒకవేళ స్వతంత్ర అభ్యర్థిగా ఉండి ఒక రాజకీయ పార్టీయో, కూటమో మద్దతు ఇచ్చినపుడు కూడా ఓటర్ల అభీష్టానికి నిబద్ధుడై ఉండాలి’ అని జస్టిస్ కున్హికృష్ణన్ స్పష్టం చేశారు. అయితే, రాజకీయ పార్టీలు మద్దతు లేకుండా స్వతంత్రంగా పోటీ చేసి గెలిచిన అభ్యర్థులకు ఇది వర్తించదని కోర్టు పేర్కొంది. ‘అధికారం అవినీతికి మొగ్గు చూపుతుంది., సంపూర్ణ అధికారం సంపూర్ణ అవినీతి వైపు మొగ్గుతుంది’ అనే ఆంగ్ల చరిత్రకారుడు, రచయిత లార్డ్ ఆక్టన్ సూక్తిని ఈ సందర్భంగా కోర్టు గుర్తు చేసింది.
‘ప్రజాస్వామ్యంలో ఎన్నికైన ప్రజాప్రతినిధులు ఓ అడుగు వేసే ముందు ఈ సూక్తిని గుర్తు చేసుకోవాలి.. ప్రతినిధులకు రిమోట్ కంట్రోల్ వాళ్లను ఎన్నుకొన్న ఓటర్లే. ఇందులో పేదలు, దినకూలీలు, స్వీపర్ల వంటివాళ్లు కూడా ఉంటారు’ అని న్యాయమూర్తి అన్నారు. ఒకసారి ఎన్నికైన సభ్యుడు తనను ఎన్నుకొన్న ప్రజల అభీష్టానికి ప్రతీకగా ఉండేలా చూడటమే ఫిరాయింపుల నిరోధక చట్టం ఉద్దేమని పేర్కొన్నారు.