‘రానున్న సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ, జనసేన కూటమి అధికారంలోకి వస్తుంది. అందులో లోకేష్ కీలకపాత్ర వహిస్తారు. ఆయన సహకారంతో టెక్కలి నియోజకవర్గాన్ని జిల్లాకేంద్రంగా మారుస్తా’నని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, టెక్కలి ఎమ్మెల్యే కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. ఆదివారం రాత్రి టెక్కలిలోని శంఖారావ సభలో ఆయన మాట్లాడారు. నియోజకవర్గంలో ప్రతి ఇంటికి స్వచ్ఛమైన తాగునీరు ఇవ్వాలని, వంశధార ప్రధాన ఎడవకాలువ హిరమండలం నుంచి వజ్రపుకొత్తూరు వరకు కాలువ ఆధునీకరణకు చేపట్టాలని లోకేశ్‌ను కోరారు. ‘టీడీపీ హయాంలో వంశధార ప్రాజెక్టు పనులు 72 శాతం పూర్తిచేశాం. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దానిని పట్టించుకోలేదు. కాలువలన్నీ పూడికపోయి రైతులు సాగునీటి కోసం రోడ్డున పడ్డారు. రాష్ట్రాన్ని సీఎం జగన్ సర్వనాశనం చేశారు. రానున్న ఎన్నికల్లో ఓటమి భయంతో జగన్.. పేదవాడినని కొత్తరాగం అందుకుంటున్నార’ని అచ్చెన్న విమర్శించారు. సాక్షి పేపర్, టీవీ, బెంగుళూరులో ప్యాలెస్, హైదరాబాద్‌లో లోటస్‌పాండ్, తాడేపల్లి ప్యాలెస్, రూ.500 కోట్లతో రుషికొండలో కట్టిన ప్యాలెస్‌లు ఎవరివని ప్రశ్నించారు. ‘టీడీపీ కార్యకర్తలను ఇబ్బంది పెట్టినవారి పేర్లను లోకేశ్‌బాబు రెడ్‌బుక్‌లో రాసుకుంటున్నారు. నేను బుర్రలోనే ఫీడ్ చేసుకున్నాను. అధికారంలోకి వచ్చిన ఆరునెలల్లో వారికి చక్రవడ్డీతో సహా సెటిల్ చేస్తా’నని అచ్చెన్న తెలిపారు. రాష్ట్రంలో 175 స్థానాల్లో టీడీపీ, జనసేన కూటమి గెలుస్తుందని, పులివెందులలో కూడా టీడీపీ జెండా ఎగురవేస్తామని స్పష్టం చేశారు.