వైసీపీ ప్రభుత్వంపై ఏపీ ఎన్జీవోలు మరోసారి సమర శంఖం పూరించారు. సమస్యలపై ఎన్నిసార్లు మొర పెట్టుకున్నా సీఎం జగన్ వినడం లేదని ఎన్జీవోలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ సమస్యల పరిష్కారానికి ఉద్యమానికి వెళ్లాల్సిందేనని వారు నిర్ణయం తీసుకున్నారు. విజయవాడలో ఆదివారం ఏపీ ఎన్జీవో జేఏసీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించింది. సమస్యల పరిష్కారానికి ఉద్యమం చేయాల్సిందేనని నాయకత్వంపై ఒత్తిడి తీసుకు వచ్చారు. ప్రభుత్వం సమస్యలు పరిష్కరించకుండా ఇన్ని రోజులు కాలయాపన చేస్తున్న సంఘం నేతలు ఎలాంటి చర్యలను ఎందుకు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. సంఘం నేతలు ప్రభుత్వానికి వత్తాసు పలికితే తమ గళం వినిపిస్తామని ఏపీ ఎన్జీవోలు హెచ్చరించారు. డీఏ బకాయిలు, సరెండర్ లీవ్ బకాయిలు, GPF, APGLI బకాయిలను ప్రభుత్వం ఇవ్వకపోవడంపై సమావేశంలో మండిపడ్డారు. IR 30 శాతం ఇవ్వాల్సిందేనని నేతలు స్పష్టం చేశారు. ధర్నాలు, ర్యాలీలు, ఛలో విజయవాడ వంటి కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ రోజు ఉద్యమ కార్యాచరణ ప్రకటించాలని ఏపీ ఎన్జీవోలు నిర్ణయం తీసుకున్నారు. సంఘం నేతలు కూడా తమతో కలిసి రావాలని లేకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఏపీ ఎన్జీవోలు హెచ్చరించారు.