ప్రతి దాంట్లో సీఎం జగన్ రెడ్డి అక్రమాలకు పాల్పడుతున్నాడని తెలుగుదేశం జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ఆరోపించారు. ఆదివారం నాడు టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మేనమామ అని టైటిల్ పెట్టుకొని స్కూల్ పిల్లలు చదువుకునే పుస్తకాల్లో కూడా కంస మామ జగన్ రెడ్డి భారీ దోపిడీకి పాల్పడుతున్నారని విమర్శించారు. మంత్రి బొత్స సత్యనారాయణ ఆధ్వర్యంలో నేడు ప్రభుత్వ పాఠ్య పుస్తకాల ముద్రణలో రూ.100 నుంచి రూ.120 కోట్ల భారీ స్కాంకు తెరలేపారని ఆరోపించారు. 2022లో టన్ను పేపర్ ధర రూ. లక్ష ఉన్న సమయంలో ఒక్కో పేజీ ముద్రణకు 23 పైసలను కంస మామ సర్కార్ ధర నిర్ణయించిందన్నారు. నేడు పేపర్ ధర భారీగా తగ్గిన పరిస్థితుల్లో కూడా ఒక్కో పేజీ ముద్రణకు 34.2 పైసల ధర నిర్ణయించటం దోపిడీ కాక మరేంటి? అని ప్రశ్నించారు. గతంలో ప్రభుత్వమే పేపర్‌ను కొనుగోలు చేసి పాఠ్య పుస్తకాల ముద్రణకు ప్రింటర్స్‌కు అందించే విధానం ఉండేదని కానీ వైసీపీ ప్రభుత్వం ఆ విధానాన్ని ఇప్పుడు ఎందుకు రద్దు చేశారని నిలదీశారు. నేడు పేపర్ కొనుగోళ్లలో కూడా జగన్, మంత్రి బొత్స తన బినామీ ప్రింటర్స్‌కు ఇచ్చి ఈ భారీ స్కాంకు తెరలేపారని మండిపడ్డారు. కంసమామ జగన్ కనుసన్నల్లో మంత్రి బొత్స రాబోయే ఎన్నికల్లో తన ఎన్నికల ఖర్చు కోసమే ఈ భారీ స్కాంకు తెరలేపారని విమర్శించారు. కనీసం రిజిస్ట్రేషన్ కూడా లేనటువంటి సంస్థలను కూడా టెండర్‌లో పాల్గొనేందుకు అవకాశం కల్పించి బొత్స సత్యనారాయణ తన బీనామీలను తెరమీదకు తీసుకువస్తున్నారని ఆరోపించారు. ఈ రూ.100కోట్ల స్కాం టెండర్‌ను తక్షణమే రద్దు చేయాలని.. ప్రభుత్వమే పాత పద్ధతిలో పేపర్‌ను తక్కువ ధరకు కొనుగోలు చేసి పాఠ్య పుస్తకాల ముద్రణ చేపట్టాలని కొమ్మారెడ్డి పట్టాభిరామ్ డిమాండ్ చేశారు.