వ్యవసాయోత్పత్తుల మద్దతు ధరకు చట్టబద్ధత సహా తమ 20 డిమాండ్ల పరిష్కారం కోరుతూ అన్నదాతలు ఢిల్లీ ఛలో మార్చ్ చేపట్టారు. ఈ ఆందోళనలను అడ్డుకునే ప్రయత్నాల్లో భాగంగా హరియాణా, ఢిల్లీ పోలీసులు దేశ రాజధానికి వచ్చే అన్ని మార్గాలను మూసివేసి.. అష్టదిగ్బంధనం చేశారు. ఎక్కడిక్కడ బారికేడ్లు, కాంక్రిట్ దిమ్మెలు పెట్టి, ఇనుప కంచెలు, మేకులు అమర్చి.. భారీగా బలగాలను మోహరించారు. అయినాసరే కర్షకులు వెనక్కి తగ్గడంలేదు. దిగ్బంధనాలను దాటుకుని ఢిల్లీలో అడుగుపెట్టాలనే సంకల్పంతో ముందుకు సాగుతున్నారు. దీంతో ఢిల్లీ నగరంలో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. రైతులపైకి వాటర్ క్యానర్లు, బాష్పవాయువు గోళాలను ప్రయోగిస్తున్నారు. అయినాసరే ఆందోళనకారులు వెనక్కితగ్గడం లేదు.
ఇదిలా ఉండగా సుదీర్ఘ ఆందోళనకు సిద్ధపడి.. అందుకు తగిన ఏర్పాట్లను చేసుకుని వచ్చినట్టు రైతులు వెల్లడించారు. ఆరు నెలలకు సరిపడే సామాగ్రి, వాహనాలకు డీజిల్‌ను తమవెంట తెచ్చుకున్నామని పంజాబ్‌కు చెందిన రైతు ఒకరు తెలిపారు. సాగు చట్టాలకు వ్యతిరేకంగా 13 నెలల పాటు ఆందోళన నిర్వహించిన విషయాన్ని గుర్తుచేశారు. తమ సహనానికి పరీక్ష పెట్టినా డిమాండ్లు నెరవేరే వరకు నిరసనను కొనసాగిస్తామని చెప్పారు. ‘సూది నుంచి సుత్తి వరకు రాళ్లను పగులగొట్టే సాధనాలతో సహా మా ట్రాలీలలో మాకు అవసరమైనవన్నీ ఉన్నాయి. దీంతో పాటు ఆరు నెలలకు సరిపడా రేషన్‌తో మేము గ్రామం నుంచి బయలుదేరాం.. మా సోదరులకు కూడా సరిపడా డీజిల్ మా వద్ద ఉంది’ అని పంజాబ్‌లోని గురుదాస్‌పూర్‌కు చెందిన రైతు హర్బజన్ సింగ్ అన్నారు. ట్రాక్టర్లు, ట్రాలీలతో చేస్తున్న ఆందోళనను అడ్డుకునేందుకు డీజిల్ సరఫరా చేయడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు.
‘కిందటిసారి 13 నెలలతో పోల్చితే ఇదేం కష్టం కాదు.. మా డిమాండ్లను నెరవేరుస్తామని హామీ ఇచ్చారు.. కానీ ప్రభుత్వం తన హామీని నిలబెట్టుకోలేదు. ఈసారి మా డిమాండ్లన్నీ నెరవేరిన తర్వాతే బయలుదేరి వెళ్తాం’ అని హర్బజన్ స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వంతో రైతు సంఘాల నాయకులు జరిపిన చర్చలు విఫలం కావడంతో సోమవారం రాత్రి ఫతేగఢ్ సాహిబ్ నుంచి రైతుల మార్చ్ మొదలయ్యింది.
విద్యుత్ చట్టం 2020 రద్దు, ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్ ఖేరీలో మృతి చెందిన రైతులకు పరిహారం, రైతు ఉద్యమ సమయంలో పెట్టిన కేసుల ఉపసంహరణపై వంటి డిమాండ్లతో చేపట్టిన 'ఢిల్లీ చలో' మార్చ్‌ను ఆపడానికి ఇద్దరు కేంద్ర మంత్రులు చివరి ప్రయత్నం చేశారు. కానీ, అన్ని పంటల మద్దతు ధరకు చట్టబద్ధత, రైతు రుణమాఫీ, స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల అమలుతో సహా మూడు కీలక డిమాండ్లపై ఏకాభిప్రాయం కుదరలేదు. దీంతో ఆందోళనలు కొనసాగించాలని రైతులు నిర్ణయించుకున్నారు.