కురుపాం నియోజకవర్గంలో ఓటు ఒకరికి వేస్తే.. ముగ్గురు ఎమ్మెల్యేలు తయారయ్యారని నారా లోకేష్ అన్నారు. గరుగుబిల్లి మండలం ఎర్రన్న గుడి వద్ద నిర్వహించిన శంఖారావం సభలో ఆయన మాట్లాడుతూ.. ‘ కురుపాం నియోజకవర్గంలో ఇసుక దోపిడీకి అడ్డుఅదుపు లేకుండాపోయింది. ఇష్టానుసారం తవ్వేస్తున్నారు. పుష్పశ్రీవాణిని ఎమ్మెల్యేగా ప్రజలు గెలిపిస్తే.. ఆమె భర్త శత్రుచర్ల పరీక్షిత్‌రాజు, మరిది రమేష్ కూడా ఎమ్మెల్యేలుగా చలామణి అవుతున్నారు. భారీగా అక్రమార్జనకు పాల్పడుతున్నారు. ఔట్ సోర్సిరింగ్ పోస్టుల దగ్గర నుంచి కాంట్రాక్టు పోస్టుల వరకు అమ్ముకున్నారు. ఆర్‌అండ్‌బీ, ఐటీడీఏ, ఇరిగేషన్ శాఖల ద్వారా జరుగుతున్న అభివృద్ధి పనుల కాంట్రాక్టులు ఎమ్మెల్యే మరిది రమేష్‌కే వెళ్తున్నాయి. పెద్దఎత్తున అక్రమాలకు పాల్పడుతూ కోట్లాది రూపాయలు సంపాదిస్తున్నారు. పుష్పశ్రీవాణిని రెండు సార్లు గెలిపిస్తే ప్రజలకు చేసింది ఏమీ లేదు. ఆమె మాత్రం భారీగా సంపాదన పెంచుకున్నారు. మంత్రిగా ఉండి కూడా పూర్ణపాడు-లాబేసు వంతెన నిర్మాణం పూర్తి చేయలేదు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తి చేస్తాం. జిల్లావాసులను పీడిస్తున్న ఏనుగుల సమస్యను పరిష్కరిస్తాం. వచ్చే ఎన్నికల్లో టీడీపీ - జనసేన తరపున పోటీచేసే అభ్యర్థిని గెలిపించాలి. కురుపాం నియోజకవర్గాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేయడంతో పాటు ఈ ప్రాంత నిరుద్యోగులకు ఉపాధి కల్పించే బాధ్యత టీడీపీ-జనసేన ప్రభుత్వంపై ఉంది. వైసీపీ ప్రభుత్వంపై పోరాడుతున్న టీడీపీ నాయకులు, కార్యకర్తలపై వైసీపీ ప్రభుత్వం ఎన్నో అక్రమ కేసులు పెడుతోంది. ప్రభుత్వం ఎన్ని ఎక్కువ కేసులు నమోదు చేసినా.. టీడీపీ - జనసేన ప్రభుత్వం వచ్చిన వెంటనే నామినేటెడ్ పదవులు ఇస్తాం. పార్టీలో సముచిత ప్రాధాన్యం కల్పిస్తాం.’ అని ఆయన అన్నారు.