ఇటీవల జరుగుతున్న రైలు ప్రమాదాలు తీవ్ర భయాందోళనలు కలిగిస్తున్నాయి. కొన్ని ప్రకృతి విపత్తులు కాగా.. మరికొన్ని రైల్వే సిబ్బంది చేసిన చిన్న పొరపాట్ల కారణంగా భారీ ప్రమాదాలు చోటు చేసుకున్న ఘటనలు ఉన్నాయి. తాజాగా మరో భయంకరమైన సంఘటన చోటు చేసుకుంది. డ్రైవర్ లేకుండానే ఓ రైలు ప్రయాణించడం తీవ్ర భయాందోళనలకు గురి చేసింది. అయితే ఆ రైలు ఏకంగా 70 కిలోమీటర్లు ప్రయాణించడం తీవ్ర విస్మయాన్ని కలిగిస్తోంది. ఇప్పుడు ఈ సంఘటనకు సంబంధించిన వీడియో తీవ్ర చర్చనీయాశంగా మారింది. చివరికి రైల్వే అధికారులు తీవ్రంగా శ్రమించి ఆ రైలును ఆపడంతో పెను ప్రమాదం తప్పింది. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
ఈ భయంకరమైన సంఘటన పంజాబ్ రాష్ట్రంలోని పఠాన్‌కోట్‌లో చోటు చేసుకుంది. ఓ గూడ్స్ ట్రైన్ డ్రైవర్ లేకుండా 70 కిలోమీటర్లు దూసుకెళ్లింది. అయితే రాళ్ల లోడుతో వెళ్తున్న ఆ గూడ్స్ రైలు.. 5 రైల్వే స్టేషన్లను దాటేసింది. దాదాపు గంటకు 100 కిలోమీటర్ల వేగంతో డ్రైవర్ లేకుండా ప్రయాణిస్తున్న ఆ గూడ్స్ రైలును చూసి స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. అయితే ఆ మార్గంలో ఎలాంటి రైళ్లు గానీ.. క్రాసింగ్‌లు గానీ లేకపోవడం.. ఆ గూడ్స్ రైలు పట్టాలు తప్పకుండా ప్రయాణించడంతో భారీ ప్రమాదం తప్పిందని.. రైల్వే అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.
పఠాన్‌కోట్ రైల్వే స్టేషన్‌లో గూడ్స్ రైలును ఆపిన దాని డ్రైవర్.. హ్యాండ్ బ్రేక్ వేయడం మరిచిపోయి ఉంటాడని రైల్వే ఉన్నతాధికారులు ప్రాథమికంగా అనుమానం వెల్లడించారు. అయితే ఇంజిన్ నుంచి డ్రైవర్ దిగిపోగా.. పట్టాలు జాలువారినట్లు ఉండటంతో రాళ్ల లోడుతో ఉన్న ఆ గూడ్స్ రైలు ముందుకు కదిలిందని.. అది అలాగే దూసుకువెళ్లిపోయిందని పేర్కొన్నారు. ఈ విషయాన్ని గుర్తించిన అధికారులు.. వెంటనే ఆ రైలును ఆపాలని విశ్వ ప్రయత్నాలు చేశారు. చివరికి ఉచి బస్సీ రైల్వే స్టేషన్ సమీపంలో ఆపారు. గంటకు 100 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్న రైలును ఆపేందుకు రైలు పట్టాలపై చెక్కలు, ఇతర వస్తువులను అడ్డు పెట్టి ఎట్టకేలకు దాన్ని ఆపారు.
ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని.. రైల్వే అధికారులు ధ్రువీకరించారు. డ్రైవర్ లేకుండా అతి వేగంగా వెళ్తున్న ఓ గూడ్స్ రైలుకు సంబంధించిన వీడియోను ఇక ఓ రైల్వే స్టేషన్‌లో ఉన్న ప్రయాణికులు వీడియో తీసి సోషల్ మీడియాలో ఉంచడంతో అది తెగ వైరల్‌గా మారింది. ఇలాంటి ఘటనలు మళ్లీ మళ్లీ జరగకుండా అన్ని రకాల భద్రతా చర్యలు తీసుకుంటామని రైల్వే ఉన్నతాధికారులు తెలిపారు. అయితే ఈ రైలు డ్రైవర్ లేకుండా ప్రయాణించడానికి ఖచ్చితమైన కారణాన్ని ఇంకా కనుగొనలేదని ప్రకటించారు.