సరస్వతి అమ్మవారిని అవమానించి, మనోభావాలను దెబ్బతిశారని ఆరోపిస్తూ ఓ ప్రభుత్వ ఉపాధ్యాయరాలిని అధికారులు విధుల నుంచి తప్పించారు. ఈ ఘటన రాజస్థాన్‌లోని బరన్ జిల్లాలో చోటుచేసుకుంది. కిషన్‌గంజ్ ఏరియా లక్డియా గ్రామంలో ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తోన్న హేమలతా బైర్వాను డీఈఓ సస్పెండ్ చేస్తూ ఉత్వర్వులు జారీచేశారు. ‘కొంతమందికి తామే గొప్పవాళ్లమనే అనే భావన ఇంకా పోలేదని, పాఠశాలలో సరస్వతీ దేవి సహకారం ఏంటని అహంకారంతో అడుగుతారని.. అలా ఎవరు మాట్లాడారో, నేను వారిని సస్పెండ్ చేస్తున్నాను అని తన ఉత్తర్వుల్లో డీఈఓ పేర్కొన్నారు. మంత్రి బహిరంగంగా ప్రకటించిన మర్నాడే బరన్ జిల్లా డీఈఓ టీచర్‌ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీచేయడం గమనార్హం.
కిషన్‌గంజ్ ప్రాంతంలోని లక్డీ గ్రామం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ప్రబోధక్ లెవల్ 1 టీచర్ హేమలత బైర్వాను సస్పెండ్ చేస్తూ బరన్ జిల్లా విద్యా (ప్రాథమిక) అధికారి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆమెపై క్రమశిక్షణా చర్యలను పరిగణనలోకి తీసుకున్నట్టు తెలిపారు. అయితే, మతపరమైన మనోభావాలను దెబ్బతీయడం, రెచ్చగొట్టడం ఆరోపణలపై ప్రాథమిక విచారణ ముగిసిన తర్వాత సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేసినట్లు బరన్ జిల్లా విద్యా శాఖ అధికారి పేర్కొన్నారు.
గణతంత్ర దినోత్సవ కార్యక్రమంలో వేదికపై సరస్వతీ దేవి ఫోటోను ఉంచే విషయంలో మతపరమైన మనోభావాలను దెబ్బతీసేందుకు, రెచ్చగొట్టడానికి ఉపాధ్యాయుడే కారణమని విచారణలో స్థానికులు వెల్లడించారు. ఆమెను సస్పెండ్ చేస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసినట్లు బరన్ జిల్లా విద్యా (ప్రాథమిక) అధికారి పీయూష్ కుమార్ శర్మ పేర్కొన్నారు. ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ డైరెక్టరేట్‌కు రిపోర్ట్ చేయాలని ఆమెను ఆదేశించినట్లు శర్మ తెలిపారు.
స్థానికులతో ఏకీభవించి, సరస్వతీ దేవి ఫోటోను వేదికపై ఉంచితే వివాదం సమసిపోయి.. గణతంత్ర దినోత్సవ వేడుకలు సజావుగా సాగేవని, అయితే ఆమె మనోభావాలను దెబ్బతీసి స్థానికులను రెచ్చగొట్టిందని అధికారి తెలిపారు. ఈ ఏడాది జనవరి 26న పాఠశాలలో గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఉపాధ్యాయురాలికి, గ్రామస్థులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. సభా వేదికపై సరస్వతీ దేవి చిత్రపటంతోపాటు మహాత్మాగాంధీ, భీమ్‌రావ్ అంబేద్కర్‌ల ఫోటోలు పెట్టాలని స్థానికులు పట్టుబట్టినప్పటికీ బైర్వా నిరాకరించారు. ఈ సందర్బంగా పాఠశాలకు, విద్యకు సరస్వతీదేవి సహకారం ఏంటి? అని ఆమె స్థానికులను మరింత రెచ్చగొట్టారు.
కాగా, అంతకు రెండు రోజుల ముందు లవ్ జీహాద్ ఆరోపణలతో ఇద్దరు ప్రభుత్వ ఉపాధ్యాయులను సస్పెండ్ చేశారు. ఇద్దర్ని సస్పెండ్ చేసి, మరో మహిళా టీచర్‌పై విచారణ ప్రారంభించారు, కోటా జిల్లాలోని సంగోడ్ ప్రాంతంలోని ప్రభుత్వ సీనియర్ సెకండరీ పాఠశాలలో ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న వీరిపై లవ్ జిహాద్, నిషేధిత ఇస్లామిక్ సంస్థలతో సంబంధాలు ఉన్నట్టు ఆరోపణలు ఉన్నాయి.