రాజ్యసభ ఎన్నికలకు మంగళవారం జరగనున్నాయి. మొత్తం దేశంలోని 15 రాష్ట్రాల్లోని 56 స్థానాలకు నోటిఫికేషన్ విడుదల చేయగా.. అందులో 12 రాష్ట్రాల్లోని 41 స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. ఇక మిగిలిన 3 రాష్ట్రాల్లోని 15 స్థానాల్లో మాత్రమే అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. రాజ్యసభ ఎన్నికల నామినేషన్ల విత్ డ్రా చివరి తేదీ నాటికి 41 మంది ఏకగ్రీవం అయినట్లు రాజ్యసభ సెక్రటేరియట్ ప్రకటించింది. ఈ 41 మంది ఏకగ్రీవం అయిన వారిలో కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జగత్ ప్రకాష్ నడ్డా ఉన్నారు. వీరే కాకుండా ఇటీవలె కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన మహారాష్ట్ర మాజీ సీఎం అశోక్ చవాన్, కేంద్ర మంత్రులు అశ్వినీ వైష్ణవ్, ఎల్ మురుగన్ పెద్దల సభకు ఏకగ్రీవం అయ్యారు.
ఇక మొత్తం 41 మంది ఏకగ్రీవంగా ఎన్నికైన అభ్యర్థుల్లో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ నుంచి అత్యధికంగా 20 మంది ఉన్నారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ నుంచి ఆరుగురు, తృణముల్ కాంగ్రెస్ పార్టీ నుంచి నలుగురు, వైఎస్సార్ కాంగ్రెస్ నుంచి ముగ్గురు, ఆర్జేడీ నుంచి ఇద్దరు, బీజేడీ నుంచి ఇద్దరు, ఎన్సీపీ, శివసేన, బీఆర్ఎస్, జేడీయూ పార్టీల నుంచి ఒక్కక్క అభ్యర్థి రాజ్యసభకు పోటీ లేకుండానే ఎన్నికయ్యారు. ఇక మిగిలిన 15 స్థానాలకు మంగళవారం ఎన్నికలు జరగనున్నాయి. ఈ 15 స్థానాలు 3 రాష్ట్రాల్లో ఉన్నాయి. ఉత్తర్‌ప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలకు సంబంధించిన రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.
ఇక తెలుగు రాష్ట్రాల్లో మొత్తం 6 ఖాళీలు ఏర్పడనుండగా.. రాజ్యసభ ఎన్నికల నామినేషన్ల విత్ డ్రా సమయానికి పోటీలో ఒక్కొక్క అభ్యర్థి మాత్రమే బరిలో నిలవగా.. వారినే విజేతలుగా అధికారులు ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్‌లో ముగ్గురు, తెలంగాణలో ముగ్గురు ఏకగ్రీవంగా రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఈ స్థానాల్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ 2 స్థానాలు, బీఆర్ఎస్ ఒక స్థానాన్ని దక్కించుకున్నాయి. కాంగ్రెస్ పార్టీ తరఫున సీనియర్ నాయకురాలు రేణుకా చౌదరీ, యువ నాయకుడు అనిల్ కుమార్ యాదవ్‌లు రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇక బీఆర్ఎస్ పార్టీ తరఫున మరోసారి వద్దిరాజు రవిచంద్రకు అవకాశం దక్కింది.
అటు ఆంధ్రప్రదేశ్‌లోని 3 రాజ్యసభ స్థానాలను అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ క్లీన్‌స్వీప్ చేసింది. వైసీపీ తరపున రాజ్యసభ సభ్యలుగా గొల్ల బాబూరావు, వైవి సుబ్బారెడ్డి, మేడా రఘునాథరెడ్డిలు నామినేషన్లు దాఖలు చేయగా.. వారు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మరోవైపు.. టీడీపీ ఆవిర్భావం తర్వాత తొలిసారి రాజ్యసభలో ఆ పార్టీ ప్రాతినిథ్యం కోల్పోయింది. రాజ్యసభ ఎన్నికల్లో పోటీకి పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు విముఖత చూపడంతో ఆ పార్టీ తరపున ఎవరు నామినేషన్ వేయలేదు. ప్రస్తుతం అసెంబ్లీలో టీడీపీకి ఉన్న బలంతో రాజ్యసభ అభ్యర్థిని గెలిపించుకునే పరిస్థితి లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.