నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ-ఎన్ఐఏ అధికారులు తాజాగా కీలక ఆపరేషన్ చేపట్టారు. ఇండియాలో గ్యాంగ్‌స్టర్‌గా పేరు గాంచిన వ్యక్తిని దక్షిణాఫ్రికాలో అదుపులోకి తీసుకున్నారు. భారత్‌లో ఆర్ఎస్ఎస్ నేతను హత్య చేసి గత కొన్నేళ్లుగా విదేశాలకు పారిపోయిన గ్యాంగ్‌స్టర్ మహ్మద్ గౌస్ నియాజీని తాజాగా అరెస్ట్ చేశారు. అనంతరం అక్కడి అధికారులు, ప్రభుత్వంతో మాట్లాడి భారత్‌కు తీసుకువచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఘటన గురించి వింటే సింగం-2 సినిమాలో డ్రగ్ డీలర్ డానీ దక్షిణాఫ్రికాలోని గ్యాంగ్‌స్టర్ల దగ్గర ఆశ్రయం పొందుతుండగా.. హీరో సూర్య అక్కడికి వెళ్లి అతడ్ని అరెస్ట్ చేయడమే కాకుండా భారత్‌కు తీసుకువచ్చి జైలులో పడేసిన సంఘటన గుర్తుకు వస్తుంది. ఇక్కడ కూడా ఎన్ఐఏ అధికారులు.. పక్కా సమాచారంతో దక్షిణాఫ్రికా వెళ్లి గ్యాంగ్‌స్టర్‌ను అరెస్ట్ చేశారు.
భారత్‌లో నిషేధిత పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా-పీఎఫ్‌ఐకి చెందిన గ్యాంగ్‌స్టర్ మహ్మద్ గౌస్ నియాజీ.. 2016 లో కర్ణాటక రాజధాని బెంగళూరులో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్-ఆర్ఎస్ఎస్ నేత రుద్రేష్‌ను హత్య చేశాడు. ఈ హత్య తర్వాత పరారీలో ఉన్న మహ్మద్ గౌస్ నియాజీ.. పోలీసులకు దొరకకుండా విదేశాలకు పారిపోయాడు. దీంతో అతడి కదలికలపై నిఘా పెట్టిన గుజరాత్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్-ఏటీఎస్.. ఇన్నేళ్ల తర్వాత ఎట్టకేలకు మహ్మద్ గౌస్ నియాజీ ఎక్కడ ఉంటున్నాడనేది పక్కా సమాచారాన్ని సేకరించింది. అతడు ఉంటున్న లొకేషన్‌ను గుర్తించి.. ఆరెస్సెస్ నేత రుద్రేష్ హత్య కేసును దర్యాప్తు చేస్తున్న ఎన్‌ఐఏకు వివరాలు అందించింది.
దీంతో అప్రమత్తమై రంగంలోకి దిగిన ఎన్‌ఐఏ అధికారులు.. మహ్మద్ గౌస్ నియాజీ కోసం దక్షిణాఫ్రికా వెళ్లి అక్కడే అరెస్టు చేశారు. అరెస్ట్ తర్వాత అతడిని భారత్‌కు తీసుకురావడానికి అధికారిక చర్యలు చేపట్టారు. దక్షిణాఫ్రికా అధికారులు.. అక్కడి ప్రభుత్వంతో చర్చలు జరిపి భారత్‌కు తీసుకురానున్నారు. ఆర్‌ఎస్ఎస్ నేత రుద్రేష్ హత్య కేసులో నిందితుడిగా ఉన్నందున మహ్మద్ గౌస్ నియాజీని ముందుగా బెంగళూరులో విచారణ చేయనున్నారు. కాగా 2016 లో సంఘ్ పరివార్ కార్యక్రమానికి హాజరైన ఆర్‌ఎస్ఎస్ నేత రుద్రేష్.. తిరిగి ఇంటికి వెళ్తుండగా బెంగళూరులోని శివాజీనగర్‌లో దుండగులు ఆయనపై దాడి చేసి హత్య చేశారు. ఆ తర్వాత ఈ హత్యకేసును కర్ణాటక ప్రభుత్వం ఎన్‌ఐఏకు అప్పగించింది. దర్యాప్తులో భాగంగా ఇప్పటికే నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు. నియాజీని పట్టించినవారికి రూ.5 లక్షల రివార్డును అప్పట్లో ఎన్‌ఐఏ ప్రకటించింది. 8 ఏళ్లుగా తప్పించుకు తిరుగుతున్న నియాజీని దక్షిణాఫ్రికాలో ఎన్ఐఏ అరెస్ట్ చేయడం గమనార్హం.