దేశంలో సార్వత్రిక ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో బీజేపీ ఎంపీ, టీమిండియా మాజీ క్రికెటర్ గౌతం గంభీర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. తాను రాజకీయాల నుంచి తప్పుకోవాలని భావిస్తున్నట్లు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు గంభీర్ ట్వీట్ చేశారు. ఎంపీగా అవకాశం కల్పించినందుకు, ఇన్నాళ్లు ప్రజలకు సేవ చేసేందుకు కారణమైనందుకు ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షాలకు గంభీర్ ధన్యవాదాలు తెలియజేశారు. క్రికెట్‌పై పూర్తి స్థాయిలో దృష్టి సారించేందుకే రాజకీయాల నుంచి తప్పుకోవాలనే నిర్ణయానికి వచ్చినట్లు గంభీర్ వెల్లడించారు.
గౌరవనీయులైన పార్టీ అధ్యక్షులు జేపీ నడ్డాగారికి నా అభ్యర్థన. నా భవిష్యత్తు క్రికెట్ కమిట్‌మెంట్లపై దృష్టి పెట్టడం కోసం దయచేసి రాజకీయ విధుల నుంచి నన్ను రిలీవ్ చేయాలని కోరుతున్నా. అలాగే ప్రజలకు సేవ చేసే భాగ్యం కల్పించినందుకు ప్రధానమంత్రి మోదీగారికి, హోం మంత్రి అమిత్ షా గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. జైహింద్ అంటూ గంభీర్ ట్వీట్ చేశారు.
2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు గౌతం గంభీర్ బీజేపీలో చేరారు. అప్పటి కేంద్ర మంత్రులు అరుణ్ జైట్లీ, రవిశంకర్ ప్రసాద్ సమక్షంలో కాషాయ కండువా కప్పుకున్నారు. నాటి ఎన్నికల్లో తూర్పుఢిల్లీ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసి 6,95,109 ఓట్ల భారీ మెజార్టీతో గెలుపొందారు. అప్పటి నుంచి వివిధ అంశాల మీద బీజేపీ తరుఫున గౌతం గంభీర్ తన గొంతు వినిపిస్తున్నారు. అలాగే క్రికెట్ కామెంటేటర్‌గా, ఐపీఎల్ మెంటార్‌గా క్రికెట్ వ్యవహారాల్లోనూ కొనసాగుతున్నారు. గత సీజన్‌లో లక్నో సూపర్ జెయింట్స్ మెంటార్‌గా వ్యవహరించిన గౌతం గంభీర్.. 2024 సీజన్ కోసం తిరిగి సొంత గూటికి చేరారు. వచ్చే సీజన్ కోసం కోల్ కతా నైట్ రైడర్స్‌కు మెంటార్‌గా వ్యవహరించనున్నారు.
అయితే వచ్చే ఎన్నికల్లో టికెట్ రాదనే వార్తలతోనే గౌతం గంభీర్ రాజకీయాలను వదిలేశాడనే వార్తలు వస్తున్నాయి. 2024 సార్వత్రిక ఎన్నికల కోసం బీజేపీ సిద్ధమవుతోంది. అందులో భాగంగా వందమంది అభ్యర్థులతో తొలి జాబితా సిద్ధం చేసినట్లు సమాచారం. ఈ జాబితాలో ప్రధాని మోదీ, రాజ్ నాథ్ సింగ్, అమిత్ షా వంటి ఉద్ధండులున్నారు. అభ్యర్థుల ఎంపిక కోసం ఢిల్లీలోని ప్రధాని నివాసంలో ఆయన నేతృత్వంలో గురువారం తీవ్ర కసరత్తు జరిగింది. ఉదయం 11 గంటలకు మొదలైన భేటీ సాయంత్రం నాలుగు వరకూ కొనసాగింది. ఆ తర్వాత కమలం పార్టీ పెద్దలు రాత్రివేళ కూడా భేటీ అయ్యారు. అయితే ఈ క్రమంలోనే గంభీర్‌కు ఈ సారి టికెట్ వచ్చే అవకాశాలు లేవనే వార్తలు వచ్చాయి. ఈ క్రమంలోనే క్రికెట్ మీద దృష్టిపెట్టేందుకు రాజకీయాల నుంచి తప్పించాలంటూ ఆయన ట్వీట్ చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.