దేశంలో సార్వత్రిక ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ ఓ ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. ఎన్నికలకు ముందు ఏ రాజకీయ పార్టీ అయినా తాము అధికారంలోకి వస్తే ఇది చేస్తాం.. అది చేస్తామంటూ హామీలు గుప్పిస్తుంటాయి. వీటిని జనంలోకి తీసుకెళ్లేందుకు సామాజిక మాద్యమాలను, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలను వాడుకుంటాయి. అయితే తాజాగా గూగుల్‌లో వచ్చే రాజకీయ ప్రకటనలకు సంబంధించి ఆసక్తికర విషయం వెల్లడైంది. గూగుల్‌లో రాజకీయ ప్రకటనల కోసం ఏ రాజకీయపార్టీ ఎంత ఖర్చుచేస్తోందనే విషయాలు వెల్లడయ్యాయి. గూగుల్ యాడ్స్ ట్రాన్స్‌పరెన్సీ సెంటర్ ఈ వివరాలను వెల్లడించింది.
గూగుల్‌లో పొలిటికల్ యాడ్స్‌కు సంబంధించి దేశవ్యాప్తంగా అత్యధికంగా ఖర్చు చేసిన పార్టీగా భారతీయ జనతా పార్టీ నిలిచింది. 2024 జనవరి ఒకటో తేదీ నుంచి మార్చి 3 వరకూ గూగుల్‌లో రాజకీయ ప్రకటనల కోసం 63 కోట్లు ఖర్చు చేశారు. ఇందులో అత్యధికంగా బీజేపీ రూ.30 కోట్ల వరకూ ఖర్చు చేసింది. ఆ తర్వాత సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ (CBC) రూ.21 కోట్లు ఖర్చు చేసింది. ఎన్నికల నేపథ్యంలో ఫిబ్రవరిలో ఈ ఖర్చు పెరిగింది. రాష్ట్రాల వారీగా చూస్తే రూ.6 కోట్లతో ఉత్తర ప్రదేశ్ మొదటి స్థానంలో ఉంది. ఆ తర్వాతి స్థానాల్లో ఒడిశా. తమిళనాడు, మహారాష్ట్ర, గుజరాత్, ఆంధ్రప్రదేశ్ ఉన్నాయి.
ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించి 2024 జనవరి 1 నుంచి మార్చి 3 తేదీ వరకూ గూగుల్‌లో రాజకీయ ప్రకటనల కోసం రూ.4.2 కోట్లు ఖర్చు చేశారు. ఇందులో పొలిటికల్ కన్సల్టెన్సీగా ఉన్న ఐప్యాక్ సంస్థ రూ.2.5కోట్లు ఖర్చు చేసింది. బీజేపీ 65 లక్షలు ఖర్చు చేయగా.. సీబీసీ 63 లక్షలు ఖర్చు చేసింది. ఇక తెలుగుదేశం పార్టీ 13 లక్షలు ఖర్చుపెట్టగా.. ఆశ్చర్యకరంగా అధికార వైసీపీ 11 లక్షలు మాత్రమే ఖర్చు చేసింది. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే వైసీపీ కోసం పనిచేస్తున్న ఐప్యాక్ సంస్థ రూ.2.5కోట్లు ఖర్చు పెట్టింది. దీంతో రాజకీయ ప్రకటన కోసం వైఎస్‌అర్‌సీపీకి పెద్దగా ఖర్చు చేయాల్సిన అవసరం రాలేదని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.
ఇక తెలంగాణ విషయానికి వస్తే జనవరి ఒకటి నుంచి మార్చి మూడో తేదీవరకూ గూగుల్‌లో రాజకీయ ప్రకటనల కోసం రూ.2.6కోట్లు ఖర్చు చేశారు. బీజేపీ అత్యధికంగా రూ.1.1 కోటి ఖర్చుచేయగా.. సీబీసీ 50 లక్షలు ఖర్చు పెట్టింది. ఐప్యాక్ 60 లక్షలు, టీడీపీ 13 లక్షల చొప్పున ఖర్చు చేశాయి. అయితే తెలంగాణలో ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికలు పూర్తైన నేపథ్యంలో రాజకీయ పార్టీలు ఇచ్చే ప్రకటనల ఖర్చు తగ్గిందనే చెప్పాలి.