ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి మీద టీడీపీ సీనియర్ లీడర్. మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల తర్వాత విశాఖలోనే సీఎంగా ప్రమాణస్వీకారం చేస్తానన్న జగన్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. ఎన్నికల తర్వాత జగన్ మోహన్ రెడ్డి లండన్ పారిపోతారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే అక్కడ భవనాలు కొన్నట్లు తమకు సమాచారం ఉందని దేవినేని ఉమ ఆరోపించారు.టీడీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన దేవినేని ఉమా.. జగన్ ప్రభుత్వ తీరుపై విమర్శలు గుప్పించారు. టీడీపీ నేతలకు భయపెట్టేందుకు, వచ్చే ఎన్నికల్లో పోటీచేయకుండా అడ్డుకోవడానికి జగన్ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.
మాజీ మంత్రి నారాయణ, ఆయన బంధువుల ఇళ్లపై సీఐడీ అధికారుల దాడులే ఇందుకు నిదర్శమని అన్నారు. మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు కుమారుడు శరత్ మీద కూడా అక్రమ కేసులు బనాయించారని దేవినేని ఉమ ఆరోపించారు. మరోవైపు ఎన్నికల నోటిఫికేషన్ వెలువడగానే తాడేపల్లి ప్యాలెస్‌కు జగన్ బాధితులు క్యూ కడతారని దేవినేని ఉమ ఆరోపించారు. ఎన్నికలు వచ్చేలోగా జగన్ విశాఖకు వెళ్తారన్న దేవినేని.. అటు నుంచి లండన్ పారిపోతారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మరోవైపు మహేష్ బాబు స్పైడర్ సినిమాలోని భైరవ క్యారెక్టర్‌తో సీఎం జగన్‌ను పోల్చారు దేవినేని. ఆ క్యారెక్టర్ లాగే జగన్ తీరు ఉందంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
మరోవైపు వచ్చే ఎన్నికల్లో దేవినేని ఉమా ఎక్కడి నుంచి పోటీచేస్తారనే విషయమై ఇంకా క్లారిటీ రాలేదు. గత ఎన్నికల సమయంలో మైలవరం నుంచి పోటీ చేసిన దేవినేని ఉమా.. అప్పటి వైసీపీ అభ్యర్థి వసంత కృష్ణప్రసాద్ చేతిలో ఓడిపోయారు. అయితే తాజాగా వసంత కృష్ణప్రసాద్ టీడీపీలో చేరారు. దీంతో టికెట్ ఎవరికి దక్కుతుందనేది ఆసక్తికరంగా మారింది. వీరిద్దరితో పాటు టీడీపీ నేత బొమ్మసాని సుబ్బారావు కూడా టీడీపీ టికెట్ ఆశిస్తున్నారు. ఈ నేపథ్యంలో దేవినేని ఉమాను పక్కనే ఉన్న పెనమలూరుకు పంపుతారంటూ ప్రచారం సాగుతోంది.