తిరుమల శ్రీవారి భక్తులకు కొన్ని కీలక సూచనలు చేశారు టీటీడీ ఈవో ధర్మారెడ్డి. డయల్ యువర్ ఈవో కార్యక్రమంలో భక్తులతో మాట్లాడారు.. వారి ప్రశ్నలకు సమాధానం చెప్పారు. యువకులైన శ్రీవారి సేవకులు క్యూ లైన్లు, శ్రీవారి ఆలయంలో భక్తులకు సేవలందించేందుకు ముందుకు రావాలని టీటీడీ ఈవో ధర్మారెడ్డి పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా టీటీడీ చేపట్టిన అనేక కార్యక్రమాలతో పాటు ధార్మిక మరియు ఎస్వీబీసీ కార్యక్రమాలు బాగున్నాయని భక్తులు ప్రశంసల వర్షం కురిపించారు.
సేవా, దర్శనం టికెట్లతో పాటు వసతి బుక్ చేసుకునే అవకాశం కల్పించాలని ఓ భక్తుడు కోరారు. ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఆన్‌లైన్‌లో అడ్వాన్స్ బుకింగ్ ద్వారా దర్శనం, సేవా టికెట్లు పొందిన భక్తులకు వసతి అందుబాటులోకి వస్తుంది అన్నారు. శ్రీవారిపై ఉన్న అచంచల భక్తి వల్ల టికెట్లు త్వరగా అయిపోతున్నాయన్నారు ఈవో. అప్పటికి తాము టికెట్ల బుకింగ్‌ను క్లౌడ్‌లో ఉంచుతున్నామని.. తమ వ్యవస్థ చాలా పారదర్శకంగా, పటిష్టంగా, అద్బుతంగా పనిచేస్తోందన్నారు. ప్రతి రోజు వేలాది మంది భక్తులు తిరుమల శ్రీవారి దర్శనానికి వస్తుంటారని.. వారికి ఎలాంటి అసౌకర్యం కలుగకుండా సేవలందించడానికి 60 సంవత్సరాలలోపు వారైతే బాగా సేవలందిస్తారన్నారు.
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రతి భక్తుడికి ఒక ఉచిత లడ్డూ అందిస్తున్నామని.. బ్రహ్మోత్సవాలు, వైకుంఠ ఏకాదశి తదితర పర్వదినాల్లో తప్ప, మిగిలిన సమయంలో భక్తులు కావాలసినన్ని లడ్డూలు పొందవచ్చని ఈవో తెలిపారు. తిరుమల శ్రీవారి లడ్డూ బరువు, పరిమాణం తగ్గలేదు, రేటు తగ్గించడానికి అవకాశం లేదన్నారు. శ్రీవారిని దగ్గరగా దర్శించుకునేందుకు.. వీఐపీ సిఫారస్సు లేఖలు, శ్రీవాణి ట్రస్టు ద్వారా టికెట్లు కొనుగోలు చేసి బ్రేక్ దర్శనం పొందవచ్చన్నారు.
గతంలో శ్రీవారి సేవకులకు సుపథం ద్వారా వెళ్లి దర్శించుకునేవారని.. ప్రస్తుతం రూ.300/- క్యూ లైన్‌లోనే శ్రీవారి సేవకులకు దర్శనం కల్పిస్తున్నామన్నారు టీటీడీ ఈవో. గతంలో 50 సంవత్సరాల క్రితం నిర్మించిన సప్తగిరి విశ్రాంతి గృహాలను ఆధునీకరిస్తామన్నారు. కొత్త గీజర్లు పెట్టిన అన్ని వసతి గదులలో వెంటనే కనెక్షన్ ఇవ్వవలసిందిగా అధికారులను ఆదేశించామని.. పాంచజన్యంలో బొద్దింకల నివారణకు వెంటనే చర్యలు తీసుకుంటామన్నారు. తిరుపతి నుంచి తిరుమలకు బస్సులను నామమాత్రపు ధరలకు టీటీడీ నడపటం సాధ్యం కాదన్నారు. వయోవృద్ధులు, దివ్యాంగులకు సహయకులుగా భార్య లేదా భర్త, శ్రీవారి సేవకులు ఉంటారన్నారు టీటీడీ ఈవో. శ్రీవారి సేవకులకు అవగాహన కలగడానికి రెండు రోజులు పడుతుంది.. కావున శ్రీవారిసేవ 7 రోజులుగా నిర్ణయించామన్నారు.
సర్వభూపాల వాహనంపై కాళీయమర్ధనుడి అలంకారంలో శ్రీనివాసుడు
శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో ఆదివారం రాత్రి శ్రీదేవి, భూదేవి సమేత శ్రీనివాసుడు కాళీయమర్ధనుడి అలంకారంలో సర్వభూపాల వాహనంపై అభయమిచ్చారు. రాత్రి 7 గంటలకు స్వామివారు నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులను కటాక్షించారు. వాహనం ముందు భక్తజన బృందాలు చెక్కభజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి వాహనసేవ కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు. వాహనసేవలో ఆలయ ప్రత్యేక శ్రేణి డిప్యూటీ ఈవో వరలక్ష్మీ, విజివో బాలిరెడ్డి, ఏఈవో గోపినాథ్, వైఖానస ఆగమ సలహాదారులు మోహన రంగాచార్యులు, సూపరింటెండెంట్ వెంకటస్వామి, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ కిరణ్ కుమార్ రెడ్డి, ఆలయ అర్చకులు బాలాజి రంగచార్యులు పాల్గొన్నారు.
సింహ వాహనంపై శ్రీ కామాక్షి సమేత సోమస్కందమూర్తి
తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో మూడవ రోజైన ఆదివారం రాత్రి శ్రీ కపిలేశ్వరస్వామివారు కామాక్షి అమ్మవారి సమేతంగా సోమస్కందమూర్తిగా సింహ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. వాహనసేవ ఆలయం నుండి మొదలై కపిలతీర్థం రోడ్, అన్నారావు సర్కిల్, వినాయక నగర్ క్వార్టర్స్, హరేరామ హరేకృష్ణ గుడి, ఎన్‌జిఓ కాలనీ, అలిపిరి బైపాస్ రోడ్ మీదుగా తిరిగి ఆలయానికి చేరుకుంది. భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించారు. భక్తజన బృందాల చెక్కభజనలు, వాయిద్యాలు ఆకట్టుకున్నాయి. మృగరాజు సింహం. దేవతల్లో అత్యంత ఉత్కృష్టుడు పరమేశ్వరుడు. భక్తుల హృదయం గుహ వంటిది. ఆ గుహలో సింహం వంటి ఈశ్వరుని ఆరాధిస్తూ ఉంచుకుంటే జీవుడు ఏ భయాన్ని పొందడు. మృగరాజు వంటి శివపరమాత్మ కొలువై అభయమిచ్చి జీవనాన్ని పాలిస్తుంటే, అరిషడ్వర్గాలనే క్షుద్రమృగాల భయం ఉండదు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa