కేంద్ర ఎన్నికల కమిషనర్ అరుణ్ గోయెల్ రాజీనామా ప్రస్తుతం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారి తీసింది. వచ్చే వారం లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ విడుదల కానుందని వార్తలు వస్తున్న వేళ.. అరుణ్ గోయెల్ పదవి నుంచి తప్పుకోవడం సంచలనం రేపుతోంది. కేంద్ర ఎన్నికల కమిషనర్ పదవికి రాజీనామా చేసిన అరుణ్ గోయెల్.. తన రాజీనామా లేఖను రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మూకు పంపించారు. ఆ వెంటనే అరుణ్ గోయెల్ రాజీనామాను రాష్ట్రపతి ఆమోదించారు. ఈ విషయాన్ని కేంద్ర న్యాయమంత్రిత్వ శాఖ వెల్లడించింది.
అయితే అరుణ్ గోయెల్ తన పదవీ కాలం ముగియక ముందే అకస్మాత్తుగా రాజీనామా చేయడం ప్రస్తుతం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘంలోని ముగ్గురు సభ్యుల ప్యానెల్‌లోని మరో ఎన్నికల కమిషనర్ అనుప్ పాండే.. ఈ ఫిబ్రవరిలో పదవీ విరమణ చేయగా ఆ స్థానం ఖాళీగా ఉంది. తాజాగా అరుణ్ గోయెల్ కూడా రాజీనామా చేయడంతో ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ ఒక్కరు మాత్రమే మిగిలారు. అరుణ్ గోయెల్ పదవీకాలం 2027 డిసెంబరు వరకు ఉండగా.. అర్ధాంతరంగా ఆయన పదవికి రాజీనామా చేయడం ఎవరికీ అంతు చిక్కడం లేదు.
సీఈసీ రాజీవ్ కుమార్ పదవీ కాలం కూడా వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ముగియనుంది. రాజీవ్ కుమార్ తర్వాత చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్‌గా అరుణ్ గోయెల్ బాధ్యతలు చేపట్టే అవకాశం ఉండగా.. ఈలోగా ఆయన రాజీనామా చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. అరుణ్ గోయెల్‌ను కేంద్ర ఎన్నికల కమిషనర్‌గా నియమించడంపై అప్పట్లో తీవ్ర విమర్శలు వ్యక్తం అయ్యాయి. గతంలో కేంద్ర భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖలో కార్యదర్శిగా పనిచేసిన అరుణ్ గోయెల్ 2022 నవంబర్ 18 వ తేదీన ఆ పదవికి రాజీనామా చేశారు. అనంతరం ఒకరోజు తర్వాత ఎన్నికల కమిషనర్‌గా నియమితులు అయ్యారు.
ఈ నిర్ణయంపై సుప్రీంకోర్టులో కూడా పలువురు పిటిషన్‌లు దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. కేంద్ర ఎన్నికల కమిషనర్‌గా అరుణ్ గోయెల్‌ను ఎందుకంత వేగంగా నియమించారని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఆయన నియామకానికి సంబంధించిన ఫైళ్లను మెరుపు వేగంతో ఎందుకు ఆమోదించారని నిలదీసింది. ఆయన రాజీనామా చేసి 24 గంటలు కూడా గడవకముందే మొత్తం నియామక ప్రక్రియ ఎలా పూర్తి చేశారని సుప్రీంకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది.
మార్చి 14 లేదా 15 వ తేదీన లోక్‌సభ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల కావచ్చని వార్తలు వస్తున్న వేళ.. అరుణ్ గోయెల్ రాజీనామా చేయడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. అయితే అరుణ్ గోయెల్ రాజీనామా వల్ల లోక్‌సభ ఎన్నికల నిర్వహణపై ప్రభావం పడొచ్చని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.