భారత్‌తో మాల్దీవులు పెట్టుకున్న వివాదంతో ఆ దేశం చాలా నష్టపోయింది. అయినప్పటికీ ఆ దేశ అధ్యక్షుడు మహ్మద్ మొయిజ్జూ మాత్రం ఇప్పటికీ భారత్ పట్ల తన అక్కసును వెళ్లగక్కుతూనే ఉన్నారు. ఈ క్రమంలోనే మాల్దీవులు మాజీ అధ్యక్షుడు భారత్‌కు క్షమాపణలు చెప్పారు. మాల్దీవులు ప్రజల తరఫున క్షమాపణలు చెబుతున్నామని.. భారత్‌తో పెట్టుకున్న ఘర్షణ కారణంగా మాల్దీవులపై ఎంతో ప్రభావం పడిందని తెలిపారు. మరీ ముఖ్యంగా పర్యాటక రంగం తీవ్రంగా దెబ్బతిందని.. ఇప్పటికైనా భారతీయులు తమ పర్యటనల కోసం మాల్దీవులకు రావాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు భారత్ మాల్దీవులు దౌత్య వివాదంపై ఆ దేశ మాజీ అధ్యక్షుడు మహ్మద్ నషీద్ స్పందించారు.
భారత్‌తో వివాదం తమపై ఎంతో ప్రభావం చూపిందని.. మహ్మద్ నషీద్ తెలిపారు. మాల్దీవులు పర్యాటక రంగం చిన్నాభిన్నం అయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగానే దేశ ప్రజల తరఫున భారత్‌కు క్షమాపణలు తెలియజేశారు. భారత్‌లో పర్యటించిన మహ్మద్ నషీద్.. ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ వేసవి సెలవులకు భారతీయులు తమ దేశానికి రావాలని కోరుకుంటున్నామని.. తమ ఆతిథ్యం ఎప్పటిలాగే ఉంటుందని.. అందులో ఎలాంటి మార్పు ఉండదని మహ్మద్ నషీద్ మీడియాతకు వెల్లడించారు.
మాల్దీవుల్లో ఉన్న భారత సైన్యం.. వెనక్కి వెళ్లిపోవాలని తమ అధ్యక్షుడు మహ్మద్ మొయిజ్జూ చెప్పినపుడు.. భారత్ చాలా బాధ్యతాయుతంగా వ్యవహరించిందని నషీద్ కొనియాడారు. ఆ సమయంలో భారత్ తన బలాన్ని ప్రదర్శించాలని భావించలేదని.. సరే చర్చిద్దామంటూ సంయమనం పాటించిందని ప్రశంసించారు. ఈ నేపథ్యంలోనే ఇటీవల మాల్దీవులు-చైనా మధ్య జరిగిన సైనిక సహకార ఒప్పందం గురించి మాట్లాడారు. రబ్బర్ బుల్లెట్లు, టియర్ గ్యాస్ వంటి కొన్ని ఆయుధాలను చైనా నుంచి మహ్మద్ మొయిజ్జూ కొనుగోలు చేయాలనుకుంటున్నారని.. అవి అవసరమని మాల్దీవులు ప్రభుత్వం భావించడం చాలా దురదృష్టకరమని నషీద్ వ్యాఖ్యానించారు.
కొన్ని నెలల క్రితం ప్రధాని నరేంద్ర మోదీ లక్షద్వీప్‌లో పర్యటించడంపై మాల్దీవుల నేతలు చేసిన వ్యాఖ్యలు రెండు దేశాల మధ్య తీవ్ర వివాదాన్ని రేకెత్తించింది. ఈ నేపథ్యంలోనే భారత్ నుంచి కూడా మాల్దీవులకు గట్టి కౌంటర్ ఎదురైంది. బాయ్‌కాట్ మాల్దీవులు అంటూ సెలబ్రిటీలు, ప్రజలు హ్యాష్‌ట్యాగ్‌తో సోషల్ మీడియాలో ట్రెండింగ్ చేస్తూ మాల్దీవులు పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే భారత్‌తో ఇంత వివాదం నెలకొన్నా.. మహ్మద్ మొయిజ్జూ మాత్రం క్రమంగా మరింత చైనాకు దగ్గరగా కావడం ఈ వివాదం మరింత ముదిరిపోతోంది. ఈ నేపథ్యంలోనే మాల్దీవులకు ఉచితంగా సైనిక పరికరాలను అందించేందుకు చైనా అంగీకరించింది.
మరోవైపు.. మాల్దీవుల్లో ఉన్న భారత సైన్యం మార్చి 10 వ తేదీ లోపు వెళ్లిపోవాలని.. మే 10 వ తర్వాత ఒక్కరు కూడా భారత సైనికులు మాల్దీవులు గడ్డపై ఉండకూదని మొయిజ్జూ తేల్చి చెప్పారు. సివిల్ డ్రెస్‌లలో కూడా భారత సిబ్బంది తమ దేశంలో ఉండడానికి వీలులేదని స్పష్టం చేశారు.