కోటి ఆశలతో బంగారు భవిష్యత్తును ఊహించుకుంటూ ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన మరో భారతీయ విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు. తెలంగాణలోని కాజీపేట పట్టణానికి చెందిన పిట్టల వెంకటరమణ (27) అనే యువకుడు వెస్ట్ ఫ్లోరిడాలో వాటర్ రేసింగ్ చేస్తుండగా జరిగిన ప్రమాదంలో తీవ్ర గాయాలై మృతి చెందాడు. మార్చి 9న ఫ్లోరిడాలో వాటర్ రేసింగ్‌లో అతడు నడుపుతోన్న జెట్స్‌కి.. ఎదురుగా వచ్చిన మరో వాటర్ బైక్ ఢీకొట్టింది. దాంతో తీవ్రంగా గాయపడిన వెంకటరమణను చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. అయితే, అతడు అప్పటికే చనిపోయినట్టు వైద్యులు ధ్రువీకరించారు.
స్థానిక మీడియా కథనం ప్రకారం.. మార్చి 9న మధ్యాహ్నం 1.30 గంటల సమయంలో విస్టీరియా ద్వీపం సమీపంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. వెంకటరమణ నడుపుతున్న వాటర్ బైక్‌ను ఢీకొట్టిన జెట్ స్కీని నడుపుతోన్న 14 ఏళ్ల బాలుడు ఈ ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డాడు. రాష్ట్రంలో వ్యక్తిగత వాటర్‌క్రాఫ్ట్‌ను నడపాలంటే 14 ఏళ్ల వయస్సు ఉండాలని ఫ్లోరిడా ఫిష్ అండ్ వైల్డ్‌లైఫ్ కన్జర్వేషన్ కమిషన్ పేర్కొంది.
ఇక, ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ నుంచి ఫిజియోథెరపీలో డిగ్రీ పూర్తిచేసిన వెంకట రమణ.. ఏడాదిన్నర కిందట అమెరికాకు వెళ్లాడు. అక్కడ ఇండియానా పోలీస్‌లోని పర్ద్యూ యూనివర్సిటీలో హెల్త్ ఇన్ఫర్మాటిక్స్‌లో ఎంఎస్ చేస్తున్నాడు. మరో రెండు నెలల్లో ఎంఎస్ పూర్తికానుండగా ఇంతలోనే ఘోరం జరిగిపోయింది. ఇక, వెంకటరమణ తండ్రి రాజ గనేశ్ రైల్వే గార్డుగా పని చేస్తున్నారు. ఆయనకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. కూతురుకి వివాహం చేసిన ఆయన.. పెద్ద కొడుకును ఉన్నత విద్య కోసం అమెరికాకు పంపారు. వెంకటరమణ మృతదేహం తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా, ఈ ఏడాదిలో ఇప్పటి వరకూ అమెరికా కనీసం 8 మంది భారతీయ, భారత సంతతి విద్యార్థులు పలు కారణాలతో ప్రాణాలు కోల్పోయారు.