దేశంలో లోక్‌సభతో పాటు ఏపీ, ఒడిశా, సిక్కిమ్, అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎలక్షన్ కమిషన్ తేదీలను శనివారం ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఏపీ ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్ కుమార్ మీనా మీడియా సమావేశం ఏర్పాటుచేసి, రాష్ట్రంలో విధివిధానాల గురించి వెళ్లడించారు. ఎన్నికల ప్రచారంలో వాలంటీర్లు పాల్గొనడంపై కేంద్ర ఎన్నికల కమిషన్ స్పష్టతనిచ్చిందని ఈ సందర్భంగా తెలిపారు. వాలంటీర్లు ప్రభుత్వంలో భాగమే కాబట్టి.. వారు ఎన్నికల ప్రచారంలో పాల్గొంటే చర్యలు తీసుకుంటామని ముకేశ్‌కుమార్ మీనా హెచ్చరించారు. వాలంటీర్లను ఎట్టి పరిస్థితుల్లోనూ ఎన్నికల విధుల్లోకి తీసుకోవద్దని ఈసీఐ నుంచి స్పష్టమైన ఆదేశాలు వచ్చాయని తెలిపారు.
అంతేకాదు, టీచర్లు లేకుండా ఎన్నికలు నిర్వహించలేమని, ఎన్నికల విధుల్లో దాదాపు 60 శాతం వారే ఉంటారని పేర్కొన్నారు. అలాగే, గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందిని ఎన్నికల విధుల్లోకి తీసుకున్నా.. వారిని కేవలం వేలికి ఇంకు వేయడానికే పరిమితం చేస్తామని మీనా చెప్పారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో ఉండే ఐదుగురు అధికారుల్లో, సచివాలయ సిబ్బంది ఒక్కరే ఉంటారని ఆయన స్పష్టం చేశారు. ఏపీలో మొత్తం 4,09,37,352 కోట్ల మంది ఓటర్లు ఉన్నారని, వీరిలో 2,00,84,276 మంది పురుషులు, 2,08,49,730 మంది మహిళలు, ఇతరులు 3,346, ఎన్ఆర్ఐ ఓటర్లు 7,763, సర్వీసు ఓటర్లు 67,393, 85 ఏళ్లు పైబడినవారు 2,12,237 మంది ఉన్నట్టు చెప్పారు.
గత 45 రోజుల్లోనే దాదాపు 1.75 లక్షల మంది కొత్తగా ఓటునమోదు చేసుకున్నారని, ఏప్రిల్ 15 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. ఆరోజు వరకు వచ్చిన దరఖాస్తులు పరిశీలించి అర్హులకు ఓటుహక్కు కల్పిస్తామన్న ఆయన.. శనివారం నుంచి తొలగింపు దరఖాస్తులు స్వీకరించడం లేదని వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా 46,165 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నామని, 179 కేంద్రాల్లో కేవలం మహిళా సిబ్బంది మాత్రమే విధుల్లో ఉంటారని ప్రధాని ఎన్నికల అధికారి పేర్కొన్నారు.
పోలింగ్‌కు ఐదు రోజుల ముందు ఓటర్ స్లిప్పులు పంపిణీ చేస్తామని, 12 రకాల గుర్తింపు కార్డుల్లో ఏదైనా చూపించి ఓటు హక్కు వినియోగించుకోవచ్చని అన్నారు. 85 ఏళ్లు దాటిన వయోవృద్ధులు, దివ్యాంగులకు ఇంటి నుంచే ఓటు వేసే వెసులుబాటు కల్పించారు. ఇందుకోసం ఫాం-12 దరఖాస్తులు నింపాల్సి ఉంటుంది. రిటర్నింగ్ అధికారి వాటిని పరిశీలించి ఓటు వేయడానికి అవకాశం కల్పిస్తారు. సంక్షేమ పథకాలకు ఇప్పటికే లబ్ధిదారులను ఎంపిక చేస్తే.. ఈసీఐ ఆమోదంతో వారికి ప్రయోజనాలు అందించవచ్చు. అయితే కొత్త లబ్ధిదారులను ఎంపిక చేయకూడదని స్పష్టం చేశారు. ఇక, ఏపీలో మే 13న ఐదో దశలో ఎన్నికలు జరగనుండగా.. ఓట్ల లెక్కింపు జూన్ 4న చేపడతారు.