రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలతో పాటు లోక్ సభకు ఎన్నికలకు సైతం షెడ్యూల్ ప్రకటించడంతో రాష్ట్రవ్యాప్తంగా ఎలక్షన్ కోడ్ అమలులోకి వచ్చింది. ఈ సమయంలో అధికారులు, నేతలు అప్రమత్తంగా ఉంటూ జాగ్రత్తగా ఉండాలి. కోడ్ నిబంధనలు పాటిస్తే చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశమూ ఉంది. కానీ కొందరు నేతలు మాత్రం యథేచ్ఛగా వ్యవహరిస్తున్నారు. ఇక అధికార పార్టీ నేతలు అయితే.. మనల్ని ఎవడ్రా ఆపేది అంటూ రెచ్చిపోతున్నారు. ఈ క్రమంలో కడప జిల్లా ప్రొద్దుటూరు వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డిపై కేసు నమోదైంది. అనుమతి లేకుండా నిన్న 38వ వార్డులో ఎన్నికల ప్రచారం నిర్వహించారంటూ ఆయనపై కేసు నమోదైంది. ఎన్నికల నియమావళిని ఉల్లంఘించి ప్రచారం నిర్వహించారని ఎన్నికల ఫ్లైయింగ్ స్క్వాడ్ అధికారిణి హైమావతి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇదే ఘటనలోనే నిన్న 38వ వార్డు వైసీపీ కౌన్సిలర్ రమాదేవి, ఆమె తనయుడు సురేష్ పై కూడా కేసు నమోదు చేశారు. ఉదయం ఏడు గంటలకు రాచమల్లు ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. విషయం తెలిసిన ఎన్నికల అధికారుల బృందం 9:30 గంటలకు ప్రచారం వద్దకు చేరుకుంది. అనుమతి లేకుండా ఎన్నికల ప్రచారం నిర్వహించకూడదని ఎన్నికల అధికారులు స్పష్టం చేశారు. మరో ఘటనలో పలువురిని వైసీపీలో చేర్చుతున్నారని వాలంటీర్ సుబ్బారావుపై ఎన్నికల సంఘం అధికారులు చర్యలకు ఉపక్రమించారు. వైసీపీ కండువా వేసుకుని పార్టీ నాయకులతో కలిసి సుబ్బారావు ఫొటో దిగడం హాట్ టాపిక్ గా మారింది. కొత్తపల్లి పంచాయతీ-3 వ సచివాయం పరిధిలో సుబ్బారావు వాలంటీర్‌గా పనిచేస్తున్నారు. అనుమతి లేకుండా వైసీపీ నాయకులతో కలిసి కార్యక్రమం నిర్వహిండంపై టూటౌన్ పీఎస్ లో కేసు నమోదు కావడంతో అతనిని అధికారులు విధుల నుంచి తప్పించారు.