వైయస్ఆర్‌సీపీ నాయకుల కార్యక్రమాల్లో వాలంటీర్లు కనబడితే తమ వాట్సాప్ నెంబర్ కు సమాచారం పంపించమని ఒక ఫేక్ ట్విట్టర్ అకౌంట్‌ను టీడీపీ నాయకులు ప్రారంభించారని రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ అన్నారు. వాలంటీర్లు సాధారణ మనుషులు కాదా అని ఆయన ప్రశ్నించారు. వాలంటీర్లను టీడీపీ, ఐటీడీపీ భయపెట్టాలని చూస్తుందని భరత్ విమర్శించారు. శుక్రవారం ఎంపీ భరత్ రాజమండ్రిలో మీడియాతో మాట్లాడుతూ.. అభం శుభం తెలియని వాలంటీర్లపై ఎమ్మెల్యే కాండిడేట్ ఆదిరెడ్డి వాసు కక్ష తీర్చుకునే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. వాలంటీర్లు కూడా ఓటర్లేనని.. వారిని కలిసి ఓట్లు అడగకూడదా అని ఎంపీ భరత్ ప్రశ్నించారు. వాలంటీర్లు ఇంటింటికి వెళ్లి ఎవరికి ఓటు వేయమని చెప్పలేదని, ఈసీ కూడా ఈ వ్యవహారాన్ని పరిశీలించాలని ఆయన కోరారు. ప్రభుత్వ అధికారుల ఇళ్లకు వెళ్లి కూడా ఓటేయమని అడుగుతాను.. తప్పేంటి అని ప్రశ్నించారు. 23 మంది వాలంటీర్లను అన్యాయంగా సస్పెండ్ చేశారు. ఈ విషయంలో చాలా బాధపడుతున్నట్లు ఎంపీ భరత్ పేర్కొన్నారు. ఈ విషయం పునః పరిశీలించాలని రిటర్నింగ్ ఆఫీసర్ కు లెటర్ పెడతానని ఎంపీ మార్గాని భరత్ అన్నారు. ఆదిరెడ్డి అప్పారావు, వాసులకు వాలంటీర్లపై ఉన్న కక్షను ప్రజలు గమనించాలని కోరారు.