ఎన్నికల వేళ ఉపాధ్యాయుడైన తన భర్త సన్యాసినాయుడును సస్పెండ్ చేయడం దారుణమని, దీనిని తీవ్రంగా ఖండిస్తున్నానని టీడీపీ కురుపాం అభ్యర్థి తోయక జగదీశ్వరి అన్నారు. శనివారం రాత్రి ఆమె విజయవాడ నుంచి ఫోన్‌లో మాట్లాడుతూ.. గుమ్మలక్ష్మీపురం భద్రగిరిలో తన భర్తకు కేటాయించిన క్వార్టర్‌లో ఉండడం అన్యాయమా? అని ప్రశ్నించారు. తన భర్త ఎటువంటి రాజకీయాలకు పాల్పడడం లేదని తెలిపారు. ఆయన ఉపాధ్యాయుడిగా మాత్రమే పనిచేస్తున్నారని చెప్పారు. ‘ నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తుండం వల్ల మా ఇంటికి కార్యకర్తలు, ప్రజలు వస్తుంటారు.. అంతమాత్రాన నా భర్త రాజకీయాలు చేస్తున్నారు’ అని ఎలా అంటారని ఆమె ప్రశ్నించారు. ఇటువంటి వాటికి భయపడేది లేదని.. వైసీపీ ఓటమి భయంతోనే కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆరోపించారు. కొంతమంది వైసీపీ నాయకులు అవే క్వార్టర్స్‌లో రాజకీయాలు చేస్తున్నారని.. అవి కనిపించడం లేదా? అని ప్రశ్నించారు. ఏదేమైనా ఇటువంటి వాటికి జడిసేది లేదని, నిజమైన ఆదివాసి బిడ్డగా తనను గిరిజనులు, గిరిజనేతర్లు ఎమ్మెల్యేగా గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు. కాగా ప్రభుత్వం కేటాయించిన నివాస గృహాన్ని రాజకీయ కార్యకలాపాలకు వినియోగించడం ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘన అవుతుందని ఇన్‌చార్జి డీఆర్వో కేశవనాయుడు ఓ ప్రకటనలో పేర్కొన్నారు.