రాబోయే ఎన్నికల్లో టీడీపీ గెలుపు తథ్యమని రాజమహేంద్రవరం టీడీపీ-జనసేన-బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి వాసు అన్నారు. స్థానిక 40వ డివిజన్‌లో శనివారం జరిగిన భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమంలో ఆయన, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కాశి నవీన్‌కుమార్, మజ్జి రాంబాబులతో కలిసి ఇంటింటికీ వెళ్లి ప్రజలతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. కరపత్రాలు పంపిణీ చేశారు. జగన్ ప్రభుత్వం అవలంభించిన ప్రజావ్యతిరేక విధానాలను వివరించారు. ఈ సందర్భంగా వాసు మాట్లాడుతూ ఎంపీ భరత్ తన స్వార్ధం కోసం వలంటీర్లును వినియోగించుకుని వారి ఉపాధికి గండి కొట్టారని విమర్శించారు. రౌడీషీటర్లు, గంజాయి, బ్లేడ్ బ్యాచ్‌లతో ప్రజలు భయపెట్టేందుకు చూస్తున్నారని, సొంత వ్యక్తికి మునిసిపల్ కాంట్రాక్టు ఇప్పించుకుని, ప్రతి పనికి 25శాతం కమీషన్ తీసుకున్నారని, అటువంటి వ్యక్తికి మళ్ళీ పదవి ఇవ్వడం శ్రేయస్కరం కాదని ప్రజలు భావిస్తున్నారన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు సింహా నాగమణి, సింహా వెంకటేష్ , కొల్లి నాని తదితరులు పాల్గొన్నారు.