ఓ ఒంటరి ఏనుగు రోడ్డు దాటడానికి నానా తంటలు పడుతుంటే.. అటుగా వెళ్తున్న ప్రయాణికులు సెల్ఫీల కోసం ఎగబడ్డారు. ఈ ఘటనకు చిత్తూరు జిల్లా పలమనేరు మండలం గంటా ఊరు వద్ద శనివారం రాత్రి 10 గంటల ప్రాంతంలో చోటుచేసుకుంది. అటు ఇటు వెళ్లే వాహనాలు తాకిడి ఎక్కువగా ఉండడంతో ఏనుగు తీవ్ర ఇబ్బంది పడింది. ఇటువైపు అటవీ ప్రాంతం నుంచి అటువైపు వెళ్లడానికి ప్రయత్నించింది. చివరికి వాహనాల రాకపోకలు రద్దీ కారణంగా ఆ ఒంటరి ఏనుగు వెనుదిరిగింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
ఏనుగు రోడ్డుపై ఉన్నంతసేపు అటవీ అధికారులు అటువైపు రాలేదని స్థానికులు మండిపడుతున్నారు. ఆహారం కోసం ఏనుగులు సుదీర్ఘ ప్రయాణాలు చేస్తుంటాయని, కనీసం ఒకరిద్దరు ట్రాకర్స్ అయినా పెట్టి గజరాజును రోడ్డు దాటించి ఉంటే బాగుండేదని అంటున్నారు. శేషాచలం అడవుల నుంచి ఏనుగులు గ్రామాల్లోకి చొరబడి పంట పొలాలను ధ్వంసం చేస్తున్న ఘటనలు తరుచూ చోటుచేసుకున్నాయి. ఇటీవల పుంగనూరు నియోజకవర్గం చదువు మండలంలోని నాయిని వారి పల్లె సమీపంలోని పంట పొలాలపై ఏనుగులు దాడి చేశాయి. దాడులలో వరి , మామిడి , టమోటా తదితర పంటలకు అపార నష్టం కలిగిందని రైతులు వాపోయారు.
గత నెలలో గుట్టపాళ్యంలో బావిలో ఓ గున్న ఏనుగు పడిపోగా.. దానిని రక్షించి పెద్ద ఏనుగులు తీసుకెళ్లాయి. ఈ ప్రదేశమంతా ఏనుగులు తొక్కేయడంతో వరిపంట ధ్వంసమైంది. పంటపొలాలపై కొన్ని నెలలుగా వరుస దాడులతో ఏనుగులు బీభత్సం సృష్టిస్తున్నా.. సంబంధిత అటవీ అధికారులు నామమాత్రపు చర్యలు తీసుకుంటున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఏనుగుల బెడద తప్పించాలని కోరుతున్నారు.