కడపలో అవినీతి అధికారి బాగోతం బట్టబయలైంది. సోదాల సమయంలో ఆయన కూడబెట్టిన ఆస్తుల వివరాలు చూసి ఏసీబీ అధికారులు విస్మయం వ్యక్తం చేస్తారు. ఒకటా రెండా ఏకంగా రూ.70 కోట్ల విలువైన ఆస్తులను గుర్తించారు. ఇది కడప తహశీల్దారు శివప్రసాద్ అవినీతి చిట్టారు. భారీగా అక్రమాస్తులు కూడబెట్టినట్టు గుర్తించిన ఏసీబీ.. ఆయన నివాసం, కార్యాలయంతో పాటు గతంలో పనిచేసిన ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఏకకాలంలో సోదాలు నిర్వహించింది. ఫిబ్రవరి 5న తిరుపతి జిల్లా రేణిగుంట నుంచి కడపకు బదిలీ అయిన శివప్రసాద్.. ద్వారకానగర్‌లోని అపార్ట్‌మెంటులో నివాసం ఉంటున్నారు.
అయితే, రేణిగుంట తహశీల్దార్‌గా ఉన్నప్పుడు ఆయన అక్రమాలకు పాల్పడినట్టు ఆరోపణలు వచ్చాయి. ప్రభుత్వ భూములకు పట్టాలు ఇవ్వడం, అసైన్డ్, డీకేటీ భూములకు నో అబ్జక్షన్ సర్టిఫికెట్లు ఇచ్చి అక్రమంగా ఆస్తులు సంపాదించినట్టు ఫిర్యాదు అందాయి. దీంతో ఏసీబీ బృందం రంగంలోకి దిగింది. కడపలో ఆయన నివాసంలో సోదాలు నిర్వహించింది. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని తిరుపతి, పీలేరు, బంగారుపాళ్యం, రేణిగుంట మండలం యర్రమరెడ్డిపాలెంలోని తొమ్మిది చోట్ల ఆయన.. ఆయన బంధువుల నివాసాల్లో దాడులు జరిపారు. ముఖ్యంగా శివప్రసాద్ ఎక్కువ కాలం పనిచేసిన తిరుపతిలోనే ఆయన భార్య పేరు మీద భారీగా ఆస్తులు కూడబెట్టినట్టు అధికారులు పేర్కొన్నారు.
తిరుపతి నగరం వైకుంఠపురంలో 266.66 చదరపు గజాల విస్తీర్ణంలో రెండంతస్తుల భవనంలోని ఆస్పత్రి, పీలేరులో 158.89 చదరపు గజాల స్థలంలో రెండు అంతస్తుల భవనం, తిరుపతి, రేణిగుంటలో ఐదు ఇళ్ల స్థలాలు, దామినేడు వద్ద 33 సెంట్ల భూమి, చెర్లోపల్లెలో 1,685 చదరపు అడుగులు స్థలం, వైకుంఠపురంలోని అలంకృతి మాల్ భవనం ఉన్నట్టు గుర్తించారు. వీటి విలువ రూ.70 కోట్లు ఉండొచ్చని అంచనా.
అలాగే, ఖరీదైన రెండు కార్లు, మూడు బైక్‌లు, విలువైన వస్తువులు ఉన్నాయి. రూ 2.31 లక్షల నగదు, 390 గ్రాముల బంగారు నగలను స్వాధీనం చేసుకున్నారు. విలువైన డాక్యుమెంట్లు, కొన్ని భూములకు సంబంధించి రిజిస్ట్రేషన్ పత్రాలు కూడా లభ్యమయ్యాయి. ఈ సోదాలు మరో వారం రోజులు కొనసాగించనున్నట్టు తెలుస్తోంది. బినామీ పేర్లతో ఉన్న ఆస్తులు, బ్యాంకు లాకర్లు, లావాదేవీలపై దృష్టి సారించారు. కడపలోని ప్రస్తుతం ఆయన నివాసంలో రూ.36 లక్షల నగదు పట్టుబడింది. అయితే, ఎన్నికల ఖర్చుల కోసం రూ.59 లక్షలు డ్రా చేశారని, కొంత ఖర్చు చేయగా మిగిలింది తన నివాసంలో భద్రపరిచారని ఆ నగదు ఆర్డీవోకు అప్పగిస్తామని ఏసీబీ సీఐ గిరిధర్ తెలిపారు. మరో బృందం కడప తహసీల్దారు కార్యాలయంలో కూడా తనిఖీలు చేసింది.