గ్రామదేవత పండగ కోసం నవదంపతులు స్వగ్రామానికి వెళ్లి తిరిగొస్తుండగా రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో భార్య ప్రాణాలు కోల్పోగా.. భర్త తీవ్రంగా గాయపడ్డారు. గుండెల్ని మెలిపెట్టే ఈ ఘటన విశాఖపట్నం సమీపంలోని తగరపువలస వద్ద జాతీయ రహదారిపై శనివారం చోటుచేసుకుంది. సంగివలస మూడుగుళ్ల వద్ద శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో యువతి మృతి చెందింది. ప్రస్తుతం చావుబతుకులతో ఆమె భర్త ఆస్పత్రిలో పోరాడుతున్నాడు. వివరాల్లోకి వెళ్తే.. అనకాపల్లి గాంధీనగర్‌కి చెందిన చంద్ర తేజాదేవి (24)కి.. సింగనబందకి చెందిన పైడిరాజుతో ఫిబ్రవరి 18న వివాహం జరిగింది.
ఈ దంపతులు విశాఖ నగరంలోని మద్దిలపాలెంలో కాపురం ఉంటున్నారు. ఈ క్రమంలో గ్రామదేవత పండగకి కోసం స్వగ్రామం సింగనబంద వెళ్లారు. అక్కడ నుంచి తిరిగి బైక్‌తో వస్తుండగా సంగివలస మూడుగుళ్లు వద్ద ఓ లారీ.. వీరి బైక్‌ను ఢీకొట్టింది. శ్రీకాకుళం వైపు నుంచి విశాఖ వెళ్తున్న లారీ.. నవదంపతుల బైక్ హ్యాండిల్‌ను ఢీకొనడంతో రోడ్డుపై తూలిపడ్డారు. దీంతో తలకు తీవ్రగాయలై తేజాదేవి అక్కడికక్కడే మృతి చెందింది. గాయపడిన పైడిరాజును అంబులెన్స్‌లో నగరంలోని ఓ ప్రయివేటు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం పైడిరాజు పరిస్థితి కూడా విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.
ఆయనను కాపాడేందుకు వైద్యులు ప్రయత్నిస్తున్నారు. 48 గంటలు గడిస్తేగానీ ఏమీ చెప్పలేమని అంటున్నారు. అటు, రోడ్డు ప్రమాద ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు.. మృతదేహానికి స్వాధీనం చేసుకున్నారు. భీమిలి ప్రభుత్వాసుపత్రిలో శవపంచనామా నిర్వహించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారని సీఐ డి.రమేశ్ తెలిపారు. పెళ్లయిన 40 రోజులకే వధువు మృతి చెందడంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. జంటను విధి చిన్నచూపు చూసిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.